కాలర్‌ ఎగరేసుకుని బయటకు వస్తారు

6 Dec, 2023 00:49 IST|Sakshi
వక్కంతం వంశీ, నితిన్, శ్రీ లీల, రాజశేఖర్,

నితిన్‌

‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమాలో నేను ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌. కానీ రియల్‌ లైఫ్‌లో శ్రీ లీల ఎక్స్‌ట్రార్డినరీ ఉమెన్‌. ఎందుకంటే వ్యక్తిగతంగా తను డాక్టర్‌. అలాగే స్విమ్మింగ్, హాకీ, కూచిపూడి, భరతనాట్యం, వీణ.. ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. ఇక సినిమాల్లో మంచి యాక్టర్, డ్యాన్సర్‌. నాకు, దర్శకుడు వంశీకి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఈ మూవీ పెద్ద హిట్‌ అవ్వాలి.. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమా చూసిన నా అభిమానులు, ప్రేక్షకులు కాలర్‌ ఎగరేసుకుని థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’’ అని హీరో నితిన్‌ అన్నారు.

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీ లీల జంటగా నటుడు రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నితిన్‌ మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేయని పాత్రని ఈ చిత్రంలో ఇచ్చిన వక్కంతం వంశీకి థ్యాంక్స్‌. రాజశేఖర్‌గారు హీరోగా చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న (సుధాకర్‌ రెడ్డి) డిస్ట్రిబ్యూషన్‌ ఆరంభించారు.

ఆ సినిమా హిట్‌ అవడం వల్లే నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. రాజశేఖర్‌ గారు లేకపోతే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ లేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కాబోతోంది. అందరం సక్సెస్‌ మీట్‌లో కలుద్దాం’’ అని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్న నితిన్, సుధాకర్‌ రెడ్డిగార్లకు థ్యాంక్స్‌.

రాజశేఖర్‌గారు లేకుంటే ఈ సినిమాని ఊహించుకునేవాణ్ని కాదు. ఈ మూవీతో రెండున్నర గంటల సేపు కుటుంబాన్ని కడుపుబ్బా నవ్విస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది అతిథి పాత్ర. నా క్యారెక్టర్‌ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు డా. రాజశేఖర్‌. ‘‘ఈ సినిమా అందర్నీ నవ్విస్తుంది.. థియేటర్లో చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు శ్రీలీల. 

>
మరిన్ని వార్తలు