మరో ఇరవై ఏళ్లు మీ కోసం కష్టపడతా

8 Aug, 2022 00:26 IST|Sakshi
కృతీశెట్టి, నిఖిత, సుధాకర్‌ రెడ్డి, నితిన్, రాజశేఖర్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి

– నితిన్‌

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు, అభిమానుల సపోర్ట్‌ లేకుంటే నేను  ఇక్కడ ఉండేవాణ్ణి కాదు.. మీ అభిమానం, ప్రేమకి థ్యాంక్స్‌. మరో ఇరవై ఏళ్లు అయినా మీ కోసం నేను ఇలాగే కష్టపడతాను.. మీ సపోర్ట్‌ ఇలాగే ఉండాలి’’ అని నితిన్‌ అన్నారు.

ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో నితిన్  హీరోగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీశెట్టి, కేథరిన్‌ హీరోయిన్లు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నితిన్‌ మాట్లాడుతూ– ‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. నేపథ్య సంగీతానికి మణిశర్మగారు కింగ్‌ అంటారు. కానీ మా సినిమా చూశాక తండ్రికి తగ్గ తనయుడు కాదు.. తండ్రిని మించిన తనయుడిగా స్వరసాగర్‌ నేపథ్య సంగీతం కొట్టాడు. ఈ సినిమా మీకందరికీ ఫుల్‌ మీల్స్‌. ఈ చిత్రంతో రాజశేఖర్‌ పెద్ద కమర్షియల్‌ డైరెక్టర్‌ అవుతాడని నమ్ముతున్నాను. ఆగస్టు 12న గట్టిగా కొట్టబోతున్నాం’’ అన్నారు.

అతిథిగా పాల్గొన్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘దిల్‌’ సినిమా తర్వాత నితిన్‌ని కలిసి భయం భయంగా ఓ కథ చెప్పాను. అప్పుడు తను ఇచ్చిన ధైర్యంతో వెళ్లి ‘అతనొక్కడే’ సినిమా చేశా. అప్పటి నుంచి నితిన్‌తో సినిమా చేయాలనుకునే వాణ్ణి.. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తా. ‘మాచర్ల నియోజకవర్గం’ పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు.

ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను ఈ స్థాయికి రావడానికి పదిహేనేళ్లు పట్టింది. ఇండస్ట్రీలో ఎడిటర్‌గా బ్రేక్‌ ఇచ్చిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్‌. ఎడిటర్‌గా ఉన్న నన్ను డైరెక్టర్‌ని చేసిన నితిన్‌కి థ్యాంక్స్‌. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో సాలిడ్‌ హిట్‌ కొట్టబోతున్నాం’’ అన్నారు.

ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత హరి, దర్శకులు హను రాఘవపూడి, వక్కంతం వంశీ, మేర్లపాక గాంధీ, మెహర్‌ రమేశ్, నటులు బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు