ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ అంటారు!

14 Sep, 2021 00:01 IST|Sakshi

‘‘రీమేక్‌ సినిమాకి పోలికలు పెడతారు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ, పేస్ట్‌ అని ఆరోపిస్తారు. మార్పులు చేస్తే ఒరిజినల్‌ ఫిల్మ్‌ సోల్‌ను చెడగొట్టారని విమర్శిస్తారు. రీమేక్స్‌కి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఇకపై రీమేక్స్‌ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు మేర్లపాక గాంధీ. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్‌’కి రీమేక్‌గా రూపొందిన ‘మాస్ట్రో’కు మేర్లపాక గాంధీ దర్శకుడు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ చెప్పిన విశేషాలు.

‘అంధా ధున్‌’లోని థ్రిల్లింగ్, డార్క్‌ హ్యూమర్‌ అంశాలు నచ్చి, రీమేక్‌ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నితిన్, సుధాకర్‌ రెడ్డిగార్లు ఈ ప్రాజెక్ట్‌ కోసం నన్ను సంప్రదించారు. మన నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీని మార్చాం. ఒరిజినల్‌ సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్‌ను అలాగే వాడాం. ‘మాస్ట్రో’లో నితిన్‌ అంధుడిగా బాగా నటించారు. హిందీలో టబు చేసిన రోల్‌కు తమన్నాను తీసుకోవాలన్నది నా ఆలోచనే.

ఒక స్క్రిప్ట్‌ అనుకుని డెవలప్‌ చేస్తూ, కొన్ని నెలలు ట్రావెల్‌ చేశాక ఎగై్జటింగ్‌గా అనిపించకపోతే ఇంకో కొత్త స్క్రిప్ట్‌ను స్టార్ట్‌ చేస్తా. అందుకే నా సినిమాల మధ్య గ్యాప్‌ వస్తోంది. సినిమాలను ఫాస్ట్‌గా తీస్తాను కానీ కథలు రాయడంలో మాత్రం కాస్త లేట్‌. మా నాన్న (రచయిత మేర్లపాక మురళి)గారు నావెల్స్‌ రాస్తుంటారు.‘ఏక్‌ మినీ కథ’ సినిమా కథ నాదే. నాన్నగారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా నచ్చుతుందనుకుని చేశాను. పాజిటివ్‌ రెస్పాన్సే వచ్చింది. 

మరిన్ని వార్తలు