Nootokka Jillala Andagadu Review: అవసరాల శ్రీనివాస్‌ బట్టతల ప్రయోగం ఎలా ఉందంటే..?

3 Sep, 2021 12:48 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : నూటొక్క జిల్లాల అందగాడు
జానర్ : కామెడీ డ్రామా
నటీనటులు : అవసరాల శ్రీనివాస్‌, రుహానీ శర్మ, రోహిని, రాకెట్‌ రాఘవ తదితరులు
నిర్మాతలు :   శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కథ: అవసరాల శ్రీనివాస్‌
దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్
సంగీతం :  శక్తికాంత్ కార్తీక్ 
విడుదల తేది : సెప్టెంబర్‌ 3, 2021

Nootokka Jillala Andagadu Movie Review: ‘అష్టాచెమ్మా’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్‌.. మంచి నటుడిగా, దర్శకుడిగా, రచయితగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా డిఫరెంట్‌ పాత్రలతో నటిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.  .‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’సినిమాలతో ఫీల్‌ గుడ్‌ సినిమాల దర్శకుడిగా మారిపోయారాయన. తాజాగా ఆయన రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బట్టతల వల్ల ఒక యువకుడు ప్రేమ, పెళ్లి  విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ... శుక్రవారం(సెప్టెంబర్‌ 3)న థియేటర్లలో విడుదలైంది. . టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. 

నూటొక్క జిల్లాల అందగాడి కథేంటంటే..?
గొత్తి సత్యనారాయణ అలియాస్‌ జీఎస్‌ఎన్‌(అవసరాల శ్రీనివాస్‌) వంశ పారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదని, జీవితంలో తనకు పెళ్లి కూడా కాదనే అభద్రతాభావంతో జీవిస్తుంటాడు. బట్టతల ఉందనే విషయం తెలిస్తే ఎక్కడ తనను హేళన చేస్తారోనన్న భయంతో విగ్‌ పెట్టి కవర్‌ చేస్తుంటాడు. ఇలా తనని తనను ఇష్టపడని జీఎస్‌ఎన్‌.. తను పని చేసే ఆఫీస్‌లో అంజలి(రుహానీ శర్మ)ని ఇష్టపడతాడు. అంజలి కూడా జీఎస్‌ఎన్‌ని ఇష్టపడుతుంది. అయితే ఒకరోజు అనుకోకుండా జీఎస్‌ఎస్‌ విగ్‌ మ్యాటర్ అంజలికి తెలిసిపోతుంది. ఆ తర్వాత వీరి మధ్య బంధం ఎలా కొనసాగింది? బట్టతల ఉంటే ఎవరూ ఇష్టపడరనుకునే జీఎస్‌ఎన్‌ అనుమానం నిజం అయిందా?  ఆ నిజం బయటపడ్డాక వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి? చివరకు ఈ జంట ఎలా కలిశారనేదే మిగత కథ. 

ఎవరెలా చేశారంటే?
బట్టతలతో బాధపడే యువకుడు జీఎస్‌ఎన్‌ పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ అద్భుతంగా నటించాడు.. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా భారం మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. ఇక అంజలి పాత్రలో రుహానిశర్మ జీవించేసింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. అలాగే హీరో తల్లిపాత్రలో రోహిణి ఎప్పటి మాదిరే ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 


ఎలా ఉందంటే..?
పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా చేసిన సినిమానే ‘నూటొక్క జిల్లాల అందగాడు’.తన అందానికి, ఆనందానికి బట్టతల అడ్డంగా మారిందని తనను తాను అసహ్యించుకునే ఓ యువకుడి కథ ఇది. నేటి సమాజంలో చాలా మంది బట్టతల వస్తే నామోషీగా ఫీలవుతుంటారు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. అందం అంటే శరీరానికి సంబంధించినది కాదని మనసు సంబంధించినది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు. అందరికి కనెక్ట్‌ అయ్యే విషయాన్ని.. కాస్త ఫన్నీగా, ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు విద్యాసాగర్‌. 


అయితే బట్టతల కాన్సెప్ట్‌తో హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘బాలా’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘నూటొక్క జిల్లాల అందగాడు’కూడా దాదాపు అలాంటి కథే. కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త కథ. కోట్లాది మందికి ఈజీగా కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. అయితే ఈ కథను ఇంకాస్త పకడ్భందీగా తీర్చిదిద్దితే బాగుండేది. ఫస్టాఫ్‌ అంతా చాలా వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్‌ టర్న్‌ తీసుకున్నాడు. 


అయితే అక్కడ కూడా కామెడీ మిస్‌ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్‌ టిస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ కథనంలో కొత్తదనం లేకపోడం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ కూడా అంత హాట్‌ టచింగ్‌గా అనిపించకపోవడం సినిమాకు కాస్త మైనస్‌. ఇక క్లైమాక్స్‌ కూడా అందరూ ఊహించినట్టుగా రొటీన్‌గా ఉంటుంది.  డైలాగ్స​ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే..  ఈ సినిమాకు మరో ప్రధాన బలం శక్తికాంత్ కార్తీక్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎమోషనల్ సీన్లను తన రీరికార్డింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు