అవసరాల.. నవరసాల శ్రీనివాస్‌ అయ్యారు

29 Aug, 2021 05:23 IST|Sakshi
రాజీవ్‌ రెడ్డి, విద్యాసాగర్, రుహానీ శర్మ, అవసరాల శ్రీనివాస్, క్రిష్‌

– దర్శక–నిర్మాత క్రిష్‌

‘‘కంచె’ సినిమా అప్పుడు అవసరాలగారు.. ‘హైట్‌గా లేననో, జుట్టు లేదనో, కలర్‌గా లేననో అనేకమైన ఇన్‌సెక్యూరిటీస్‌తో కొందరు తమ జీవితాలను నరకప్రాయంగా మార్చుకుంటారు. దాన్ని హిలేరియస్‌గా చూపిస్తాను’ అంటూ ఓ ఇరవై నిమిషాల కథ చెప్పారు. ఆ పాయింట్‌ నాకు, రాజీవ్‌గారికి బాగా నచ్చింది’’ అన్నారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌. రాచకొండ విద్యాసాగర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ‘దిల్‌’రాజు, క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’.

సెప్టెంబర్‌ 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో క్రిష్‌ మాట్లాడుతూ – ‘‘2017లో దర్శకుడు సాగర్‌ ఓ థ్రిల్లర్‌ కథ చెప్పారు. ఆ కథను అవసరాలతో చేద్దామని నేను, రాజీవ్‌గారు అనుకున్నాం. అయితే ‘కంచె’ అప్పుడు చెప్పిన కథ గురించి అవసరాలను అడిగితే, ఆ కథకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్‌ పెట్టానని చెప్పారు. ఆ సినిమా చేద్దామను కున్నాం. అవసరాల అంకితభావం ఉన్న నటుడు. టెక్నాలజీ సాయంతో బట్టతల కనిపించేలా చేస్తామన్నాం.. కానీ బట్టతల కనిపించేలా షేవ్‌ చేసుకుని ఓ నాలుగైదు నెలలు ఆయన అలానే ఉన్నారు.

అందంగా, కొత్తగా అవసరాల శ్రీనివాస్‌.. నవరసాల శ్రీనివాస్‌ అయ్యారు. నిర్మాతలుగా ఎవరూ చెప్పని కథలను చెప్పాలని కంకణం కట్టుకున్న మాకు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ వంటి నిర్మాతలు తోడయ్యారు. ఈ సినిమా కథ వెండితెరపైకి రావడానికి కృషి చేసిన రాజీవ్‌ రెడ్డిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. రాచకొండ విద్యాసాగర్‌ మాట్లాడుతూ– ‘‘నాకు చిన్న ఫిజికల్‌ ప్రాబ్లమ్‌ ఉంది (సరిగా నడవలేకపోవడం, చేయి సరిగా ఉండకపోవడం). నేను డిఫరెంట్‌గా నడుస్తుంటే అందరూ  ఏమనుకుంటారో అని బాధపడేవాడిని. నా ఇబ్బందిని యాక్సెప్ట్‌ చేయడానికి భయపడ్డాను.

అమేజింగ్‌ కథ రాశారు శ్రీని (అవసరాల శ్రీనివాస్‌). సినిమా తీసిన రెండేళ్లకు అర్థమైంది.. అది నా కథ కూడా అని. ఈ సినిమా కథ చాలామందిని ఆలోచింపజేస్తుంది. నన్ను చూసి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నా డైరెక్షన్‌ టీమ్, చిత్రయూనిట్‌తో పాటు నా లైఫ్‌లో నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఫస్ట్‌ ఈ సినిమా ఐడియా వచ్చినప్పుడు నా ఐడియా అనుకున్నాను. స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టి క్రిష్‌గారికి చెప్పిన తర్వాత అది మా ఐడియా అయింది. ఆ తర్వాత ఆ ఐడియా సినిమాగా మారింది. సినిమా మీలోని నిజమైన మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్‌.

మరిన్ని వార్తలు