పోలీసుల‌ను నిందించ‌డం న్యాయం కాదు

20 Aug, 2020 20:16 IST|Sakshi
స్వ‌ర భాస్క‌ర్

ముంబై :  బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ద‌ర్యాప్తుపై ముంబై పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌డం న్యాయం కాద‌ని న‌టి స్వ‌ర భాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘ముంబై పోలీసుల‌ను న‌మ్మ‌క‌పోవ‌డానికి ఎలాంటి కార‌ణాలు లేవు.  సీబీఐ త‌న ప‌ని తాను నిష్పాక్షికంగా చేస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను అని పేర్కొంది. కోర్టులు, న్యాయ‌వ్య‌వ‌స్థ లాగానే పోలీసులు కూడా వారి ప‌ని చేసుకునేందుకు అనుమ‌తించాలి. అన‌వ‌స‌రంగా నింద‌లు వేయడం క‌రెక్ట్ కాదు’ అని ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడిన మాట‌లు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాకుండా 'సుశాంత్ డిప్రెష‌న్ వల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఎందుకు అనుకోకూడ‌దు? అత‌ను ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు అని కొంద‌రు ఇప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంది. ఎవ‌రైనా డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్లు బ‌య‌ట‌కు క‌నిపిస్తారా?  సుశాంత్ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు కాబట్టి మ‌నం ఈ నిజాన్ని ఒప్పుకోలేక‌పోతున్నాం. మాన‌సిక ఆరోగ్యానికి మ‌నం అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల’ని పేర్కొన్నారు. 
(ముంబై పోలీసులకు శివసేన ఎంపీ కితాబు)

సుశాంత్ కేసును సీబీఐ విచారించ‌డాన్ని స్వాగ‌తిస్తూనే న‌టి ఇలా రెండు విధాలుగా వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మొద‌టినుంచి సుశాంత్ మ‌ర‌ణం కేసు విచార‌ణ‌లో ముంబై పోలీసులు అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ద‌ర్యాప్తు సాగ‌కుండానే సుశాంత్ డిప్రెష‌న్ వ‌ల్లే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడ‌ని, అత‌ను బై పోలార్ డిసీస్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని ముంబై పోలీసులు చెప్ప‌డం తీవ్ర దుమారాన్నిరేపిన సంగ‌తి తెలిసిందే. 

అనేక మలుపుల మ‌ధ్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై విచారణను పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న రియా చక్రవర్తి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు సుశాంత్ మరణానికి సంబంధించి మరేదైనా కేసు నమోదైతే దానిని కూడా సీబీఐ మాత్రమే విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, రియాతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద రియాను మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. (రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’)

మరిన్ని వార్తలు