స్పెషల్‌ గెటప్స్‌లో...

4 Aug, 2020 02:13 IST|Sakshi
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మొత్తంలో పలు గెటప్స్‌లో కనిపిస్తారట ఈ ఇద్దరు హీరోలు. బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్‌ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని సమాచారం. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట.

మరికొన్ని గెటప్స్‌లోనూ ఎన్టీఆర్, చరణ్‌లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. త్వరలోనే తిరిగి సెట్స్‌ మీదకు వెళ్లనుంది చిత్రబృందం. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
 

మరిన్ని వార్తలు