అమిగోస్‌ షూటింగ్‌ టైంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న డైరెక్టర్‌

6 Feb, 2023 04:01 IST|Sakshi
రవిశంకర్, రాజేంద్ర రెడ్డి, ఆషిక, ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్, నవీన్‌ యెర్నేని

‘‘నవీన్, రవిశంకర్‌గార్లు నిర్మించిన రెండు చిత్రాలు(వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి) ఈ సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్స్‌ అయ్యాయి. అంత సుడి ఉన్న నిర్మాతలు తీసిన ‘అమిగోస్‌’ కూడా బ్లాక్‌ బస్టర్‌ అయి హ్యాట్రిక్‌ సాధించాలి’’ అని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. కల్యాణ్‌ రామ్, ఆషికా రంగనాథ్‌ జంటగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్‌ చదివిన రాజేంద్రగారు వారి తల్లిదండ్రులు వద్దంటున్నా ఇండస్ట్రీకి వచ్చారు. ‘అమిగోస్‌’ మొదలయ్యేలోపు వారి అమ్మగారు కాలం చేస్తే, లాస్ట్‌ షెడ్యూల్‌ సమయంలో నాన్నగారు కూడా చనిపోయారు. రాజేంద్రగారి తల్లితండ్రులు భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన సాధించిన ఈ మొదటి మెట్టు విజయాన్ని వారు చూశారు. ‘జై లవ కుశ’లో నేను మూడు పాత్రలు చేశా. మూడు విభిన్న పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘అమిగోస్‌’ లో కల్యాణ్‌ అన్న మూడు పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించారు’’ అన్నారు.

కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన ఉన్న నాకు ‘అమిగోస్‌’ పర్ఫెక్ట్‌ మూవీ. 18 ఏళ్ల పాటు నన్ను ఆదరిస్తూ, భరిస్తూ వచ్చిన మీకు (ప్రేక్షకులు, అభిమానులు) చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడరు’’ అన్నారు. ‘‘నన్ను, ‘అమిగోస్‌’ స్క్రిప్ట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్‌గారికి, నిర్మాతలు రవి, నవీన్ గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజేంద్ర రెడ్డి. ‘‘అమిగోస్‌’ని హిట్‌ చేసి, మాకు హాట్రిక్‌ (‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’) విజయాలను అందించాలి’’ అన్నారు నవీన్  యెర్నేని. ‘‘బింబిసార’ తర్వాత కల్యాణ్‌గారి నెక్ట్స్‌ లెవల్‌ పెర్ఫార్మెన్స్‌ను ఈ చిత్రంలో చూస్తారు’’ అన్నారు వై.రవిశంకర్‌. ఈ వేడుకలో డైరెక్టర్‌ బుచ్చిబాబు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

కొరటాల శివగారు, నా కాంబినేషన్‌లో సినిమా ఈ నెలలో ప్రారంభించి, మార్చిలో షూటింగ్‌ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్‌ 5న ఆ సినిమాని విడుదల చేస్తాం.
– ఎన్టీఆర్‌

మరిన్ని వార్తలు