Nuvve Naa Pranam Review: ‘నువ్వే నా ప్రాణం’ మూవీ రివ్యూ

30 Dec, 2022 14:59 IST|Sakshi

టైటిల్‌: నువ్వే నా ప్రాణం
నటీనటులు: కిర‌ణ్ రాజ్‌, ప్రియా హెగ్డే, సుమ‌న్‌, భానుచంద‌ర్‌, తిల‌క్‌, గిరి, సోనియా చౌద‌రి  త‌దిత‌రులు
నిర్మాత: శేషు మలిశెట్టి
ద‌ర్శ‌క‌త్వం:  శ్రీకృష్ణ మ‌లిశెట్టి
సంగీతం: మ‌ణిజెన్నా 
నేపథ్య సంగీతం: రాజా
విడుదల తేది: డిసెంబర్‌ 30, 2022

కథేంటంటే..
సంజు(కిరణ్‌ రాజ్‌) ఓ ఐపీఎస్‌ అధికారి. గైనకాలజిస్ట్‌ కిరణ్మయి(ప్రియా హెగ్డే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె మనసు గెలుచుకొని ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకుంటాడు. ఇలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి కొంతమంది తీవ్రవాదులు ఎంటరవుతారు.  ఈ క్రమంలో కిరణ్మయి, సంజుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. అసలు తీవ్రవాదులు సంజు వెనక ఎందుకు పడుతన్నారు? ప్రాణంగా ప్రేమించుకున్న సంజు, కిరణ్మయిలు ఎందుకు విడాకులు తీసుకున్నారు? చివరకు  వీరిద్దరు ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. 

 ఎలా ఉందంటే.. 
 ల‌వ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌ చిత్రమిది.  ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓవైపు నేటితరం యువత ఆలోచనలు,  హైఫై ఫ్యామిలీస్ వింత పోక‌డ‌లను చూపిస్తూనే.. మరోవైపు  స్వ‌ఛ్చ‌మైన ప్రేమ‌క‌థ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఈ విషయంలో డైరెక్టర్‌ కొంత వరకు సఫలం అయ్యాడు. సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం, అలాగే మెయిన్‌ పాయింట్‌ని ఎలివేట్ చేసి చూపించలేకపోయారు.

ఫ‌స్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినప్పటికీ.. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. సెకండాఫ్ గాడి తప్పింది. లాజిక్‌ లేని ల్యాగ్‌ సీన్స్‌  ఇబ్బంది కలిగిస్తాయి. కథలో కొత్తదనం లేకున్నప్పటికీ..స్క్రీన్‌ప్లేతో మ్యానేజ్‌ చేశారు. దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి స్క్రిప్ట్‌ని మరింత బలంగా రాసుకొని, ప్రమోషన్స్‌ గట్టిగా చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.  అయితే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎటువంటి అనుభ‌వం లేకుండా ఒక ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించి..దాన్ని విజ‌య‌వంతంగా రిలీజ్ చేసినందుకు శ్రీకృష్ణ మ‌లిశెట్టిని అభినందించాల్సిందే. 

ఎవరెలా చేశారంటే.. 
సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా కిర‌ణ్ రాజ్  చక్కగా నటించాడు. క‌న్న‌డ న‌టుడు అయినా అచ్చ‌మైన తెలుగు కుర్రాడిలా తెరపై కనిపించాడు. క‌న్న‌డ హీరోయిన్ అయిన ప్రియా హెగ్డే కూడా గైన‌కాల‌జిస్ట్ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఆమె అందం, అభిన‌యం రెండూ ఆక‌ట్టుకుంటాయి. సుమ‌న్, భానుచంద‌ర్, తిల‌క్ ఎప్ప‌టిలాగే వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఒక సాంకేతిక విషయానికొస్తే.. ఈ చిత్రానికి మ‌ణిజెన్నా పాట‌లు హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. పాట‌ల‌న్నీ కూడా విన‌డానికి, చూడ‌టానికి బాగున్నాయి. రాజా నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు