Karate Kalyani: కరాటే కల్యాణి ఇంట్లో అధికారులు, పోలీసుల సోదా

16 May, 2022 07:15 IST|Sakshi
కల్యాణి తల్లితో మాట్లాడుతున్న పోలీసులు, అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌(వెంగళరావునగర్‌): ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్‌ లైన్‌ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతుందని 1098 నెంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో  చైల్డ్‌లైన్‌ అధికారులు మహేష్, సంతోష్‌కుమార్‌ ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్‌మెంట్స్‌కు ఆదివారం వచ్చారు.

ఆ సమయంలో కల్యాణి, పిల్లలు ఇంట్లో లేరు. కల్యాణి తల్లి మాత్రమే ఉంది. తన కూతురు గుడికి వెళ్లిందని, ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం చెప్పింది. తన కుమార్తె ఒక బాబు (12 ఏళ్లు)ను, ఐదు నెలల పాపను పెంచుకుంటోందని, అందులో తప్పేముందని ప్రశ్నించింది. అయితే వారిని ఎక్కడనుంచి తెచ్చిందనే విషయం మాత్రం తనకు తెలియదని విలేకరులతో చెప్పారు. ఇదిలా ఉండగా చైల్డ్‌ లైన్‌ అధికారులు ఇంటివద్దకు విచారణకు వస్తున్నారని తెలిసిన కరాటే కల్యాణి ఎక్కడి వెళ్లింది ? ఎప్పుడు వస్తుంది ? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను అటు అధికారులు, ఇటు పోలీసులు విచారిస్తున్నారు. 

చదవండి: (కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు)

మరిన్ని వార్తలు