Oh My God 2: కరోనా షాక్‌, అర్థాంతరంగా నిలిచిపోయిన  షూటింగ్‌

13 Oct, 2021 16:32 IST|Sakshi

సాక్షి,ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం షూటింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించుకున్న బాలీవుడ్‌ మూవీ ‘ఓ మైగాడ్‌-2’ కు కరోనా షాక్‌ తగిలింది. యూనిట్‌లో ఏకంగా ఏడుగురికి కరోనా సోకడంతో అర్థాంతరంగా షూటింగ్‌ను నిలిపివేశారు. ​వచ్చే రెండు వారాల పాటు షూటింగ్‌ను నిలిపివేసినట్టు నిర్మాత్‌ అశ్విన్‌ వర్దే ప్రకటించాడు.

అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటిస్తున్నారు. వీరిద్దరికి కోవిడ్-19 నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే  బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లోపాల్గొనాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం సభ్యులలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అతడిని హోం క్వారంటైన్‌కి తరలించారు. అయితే ఇతర సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో  నెగెటివ్‌ రావడంతో తిరిగి​షూట్‌ను ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో  టీమ్ సభ్యులందరూ కోలుకునే వరకు రెండు వారాల పాటు షూట్‌ను నిలిపివేశారు.

అక్షయ్‌ కుమార్‌, పరేశ్‌ రావల్‌, మిథున్‌ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఓ మై గాడ్‌’. దీనికి  సీక్వల్‌గా పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్‌-2’ గా రానుంది.  ఈ చిత్రంలో అక్షయ్‌ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. సుదీర్ఘ విరామం తరువాత   కొత్త మార్గదర్శకాలతో  ఇటీవల  బాలీవుడ్‌ షూటింగ్‌ పనులు పుంజుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు