అందరికీ ఒక్కడే దేవుడు!

27 Dec, 2020 00:21 IST|Sakshi

మరపురాని జ్ఞాపకం

ఒకే కుటుంబం@50

అది 50 ఏళ్ళ క్రితం సంగతి. తెలుగునాట ఓ కాలేజీలో విభిన్న మతాల విద్యార్థుల మధ్య ఘర్షణ రేగింది. సమ్మె జరిగింది. మతవిద్వేషాల మధ్య చివరకు ఆ కాలేజీని కొంతకాలం తాత్కాలికంగా మూసేశారు. మమతలు పెంచవలసిన మతాలు, మనుషులను విడదీస్తున్న సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికంగా ఓ సినిమా వచ్చింది. సీనియర్‌ క్యారెక్టర్‌ నటుడు నాగభూషణం స్వయంగా ఓ కీలకపాత్ర పోషిస్తూ, ఓ సినిమాను సమర్పించారు. అదే పెద్ద ఎన్టీయార్‌ హీరోగా చేసిన – ‘ఒకే కుటుంబం’. ఈ క్రిస్మస్‌తో స్వర్ణోత్సవం (రిలీజ్‌ తేదీ 1970 డిసెంబర్‌ 25) పూర్తి చేసుకున్న ప్రబోధాత్మక చిత్రం.

ఎన్టీఆర్‌ సినీ కుటుంబం:
హిందువైన రాముగా పుట్టి, అనుకోకుండా ఓ ముస్లిమ్‌ ఇంట రహీముగా పెరిగి, ఓ క్రైస్తవ అమ్మాయి మేరీని ప్రేమించి, పెళ్ళాడిన ఓ యువకుడి (ఎన్టీఆర్‌) కథ ఇది. ఆ యువకుడి కన్నతండ్రి దుర్మార్గుడైన వజ్రాల వర్తకుడు (నాగభూషణం). కుమారుడని తెలియక, హీరో మీదే యాసిడ్‌ దాడి చేయిస్తాడు. అలా ముఖం అందవిహీనంగా మారే హీరో పాత్రను ఎన్టీఆర్‌ పోషించారు. ఆ తరువాత పుట్టుకతో వికారమైన ముఖం ఉన్న హీరో పాత్ర తమిళ, తెలుగు తెరపై అనేకం వచ్చాయి. శివాజీగణేశన్‌ సూపర్‌ హిట్‌ ‘దైవ మగన్‌’ (తెలుగులో ‘కోటీశ్వరుడు’) లాంటివి అందుకు ఉదాహరణ. (చదవండి: వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్‌)

ఆ రోజుల్లో ఎన్టీఆర్‌తో నాగభూషణానికి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్‌ ‘ఉమ్మడి కుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘వరకట్నం’ లాంటి తన సొంత చిత్రాలు చాలావాటిలో పాత్రలను ఎస్వీఆర్‌ అందుబాటులో లేనప్పుడల్లా, నాగభూషణానికి ఇచ్చేవారని పాత సినీ పరిశీలకుల మాట. అలాగే, ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ ఎంతో పెద్ద హీరో అయినా... సినీపరిశ్రమలోని తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సొంతంగా సినిమాలు తీసుకుంటామంటే, వారికి డేట్లిచ్చి, ప్రోత్సహించేవారు. తోటివారికి అలా చాలా సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే. ఆ క్రమంలోనే నాగభూషణానికి ఎన్టీఆర్‌ ఈ ‘ఒకే కుటుంబం’ చేశారు.  

మంచి సినిమాల మన భీమ్‌ సింగ్‌:
తమిళంలో అగ్ర దర్శకుడైన ఎ. భీమ్‌సింగ్‌ ఈ ‘ఒకే కుటుంబం’కి రూపకర్త. ఎన్టీఆర్‌ హీరోగా భీమ్‌సింగ్‌ దర్శకత్వంలో తొలి సినిమా ఇదే. తమిళంలో అగ్ర హీరో శివాజీ గణేశన్‌తో అనేక సూపర్‌ హిట్లు తీసి, హిందీలో కూడా పలు చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత భీమ్‌సింగ్‌ది. తమిళనాట ఎంతో పేరున్న భీమ్‌సింగ్‌ నిజానికి అచ్చంగా మన తెలుగువారే. తిరుపతి దగ్గర రాయలచెరువు ఆయన స్వస్థలం. ఏసుక్రీస్తుపై విజయచందర్‌ నిర్మించిన ‘కరుణామయుడు’కు కూడా దర్శకుడు భీమ్‌సింగే. ఆ చిత్రం తీస్తున్నప్పుడే అస్వస్థతకు గురై, భీమ్‌సింగ్‌ మరణించారు. 1980 – 90లలో తెలుగులో మనకు దాసరి – రాఘవేంద్రరావుల లాగా, వాళ్ళ కన్నా చాలాముందే తమిళ వెండితెరను ఇద్దరు ప్రముఖ దర్శకులు – భీమ్‌సింగ్, శ్రీధర్‌ ఏలారు. సూపర్‌ హిట్లిచ్చి, తమిళ సినీచరిత్రలో వారిద్దరూ భాగమయ్యారు. తమిళ సినీరంగం ఇప్పటికీ తలుచుకొనే ఆ ఇద్దరూ తెలుగువాళ్ళే కావడం విశేషం.

దాసరి వర్సెస్‌ నాగభూషణం?:
‘ఒకే కుటుంబం’కి భీమ్‌సింగ్‌ దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు. ఈ సినిమాకు ఆయన ఓ పాట కూడా రాశారు. అప్పట్లో తమిళ, హిందీ చిత్రాల బిజీతో ఉన్న భీమ్‌ సింగ్‌ కు  కుదరనప్పుడు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను దాసరే డైరెక్ట్‌ చేయడం విశేషం. ఆ చిత్రీకరణ సమయంలో ఏమైందో, ఏమో కానీ దర్శకుడిగా మారాలన్న ప్రయత్నంలో ఉన్న దాసరికీ, నటుడు – నిర్మాత నాగభూషణానికీ ఎక్కడో తేడా వచ్చింది. సినిమా అయిపోయినా, ఆ తరువాత కూడా వారి మధ్య ఆ పొరపొచ్చాలు సమసిపోయినట్టు లేవు. అందుకేనేమో... ఆ తరువాత దాసరి దర్శకుడై, అనేక చిత్రాలు రూపొందించినా ఆయన సినిమాల్లో నాగభూషణం కనిపించరు. ఎన్టీఆర్‌ సరసన లక్ష్మి నటించారీ చిత్రంలో. కాంతారావు, రాజశ్రీ మరో జంట.

మతసామరస్యానికి ప్రతీకగా..:
ఒక మతం ఎక్కువ, మరో మతం తక్కువ కాదంటూ... మతసామరస్యం బోధించే ఈ సినిమా కథకు తగ్గట్టుగా... టైటిల్‌కు పక్కనే గుడి, మసీదు, చర్చి శిలువ – మూడూ ఉండేలా అర్థవంతమైన డిజైన్‌ చేశారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌. ఈ సినిమాకు ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా అప్పట్లో కొందరు సినీ విమర్శకులు అభిప్రాయపడడం విశేషం. మూడు వేర్వేరు మతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాలో కనిపిస్తారు.

తొలి తరం అగ్ర హీరో నాగయ్య చుట్టుపక్కల అందరికీ మంచి చేసే ముస్లిమ్‌ పెద్ద ఇస్మాయిల్‌ పాత్రలో, అలాగే మరో తొలినాళ్ళ హీరో సిహెచ్‌. నారాయణరావు క్రైస్తవ ఫాదర్‌ జేమ్స్‌ పాత్రలో నటించారు. ఆకాశవాణిలో ‘రేడియో బావగారు’గా సుప్రసిద్ధులైన ప్రయాగ నరసింహశాస్త్రి ఈ చిత్రంలో హిందువైన శాస్త్రి పాత్రలో కనిపిస్తారు. ఎస్పీ కోదండపాడి సంగీతంలో దాశరథి రాయగా, ఎన్టీఆర్‌ పై చిత్రీకరించిన ‘అందరికీ ఒక్కడే దేవుడు’ పాట ప్రబోధాత్మకంగా సాగుతుంది. ఒకప్పుడు తరచూ రేడియోల్లో వినిపించిన ‘మంచిని మరచి వంచన చేసి’ అనే పాట సమాజంలోని పరిస్థితులను స్ఫురింపజేస్తూ, 50 ఏళ్ళ తరువాత ఇవాళ్టికీ సరిగ్గా సరిపోవడం విశేషం.     

మిస్సయిన సెంచరీ!
‘ఒకే కుటుంబం’కి మాటలు రాసింది ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు. తెలుగుదనం ఉట్టిపడేలా రాసిన ఆయన మాటలు, మరీ ముఖ్యంగా వినోదభరితమైన విలనీ పండిస్తూ నాగభూషణం పోషించిన మార్తాండం పాత్రకు రాసిన డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. నాగభూషణం పక్కన ఉండే అల్లు రామలింగయ్యతో ఈ సినిమాలో ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే’ అనే శ్లోకానికి శివుడు, విష్ణువు అంతా రూపాయిలోనే కనిపిస్తారు అంటూ చేసిన సోషల్‌ సెటైర్‌ డైలాగ్‌ అప్పట్లో అందరికీ తెగ నచ్చింది. అప్పట్లో జనాదరణ పొందిన ఈ చిత్రం నిజానికి శతదినోత్సవం జరుపుకోవాల్సిందే. అయితే, అప్పట్లో సినిమా వందరోజులు ఆడితే థియేటర్లలో వర్కర్లకు బోనస్‌ ఇచ్చే పద్ధతి ఉండేది. దాంతో, వర్కర్లకు బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందని సరిగ్గా 97 రోజులకు ‘ఒకే కుటుంబం’ చిత్రాన్ని నిర్మాతలు హాలులో నుంచి తీసేయడం విచిత్రం.

– రెంటాల జయదేవ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు