మూలిక వైద్యం ఇతివృత్తంగా వెళ్లిమలై

24 Feb, 2023 14:30 IST|Sakshi

తమిళసినిమా: దేశం విజ్ఞానం పరంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. వైద్యరంగంలో కూడా ఎన్నో మార్పులు సంతరించుకుంటున్నాయి. అలోపతి వైద్యాన్ని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. అభివృద్ధి చెందిన నగరాల విధానం ఇది అయితే గ్రామీణ ప్రాంతాల వైద్య విధానం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కుగ్రామ ప్రజలు ముఖ్యంగా కొండవాసీలు ఇప్పటికీ మూలిక వైద్య విధానాన్ని నమ్ముకుంటున్నారన్నది వాస్తవం. అలాంటి మూలిక వైద్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన చిత్రం వెళ్లిమలై.

ఓం విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజగోపాల్‌ ఇళంగోవన్‌ నిర్మించారు. ఇంతకుముందు పలు చిత్రాల్లో ముఖ్యపాత్ర పోషించిన సూపర్‌గుడ్‌ సుబ్రహ్మణి ఇందులో ప్రధాన పాత్రను పోషించారు. వీరసుభాను, అంజుకృష్ణ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఇందులో నటుడు సూపర్‌గుడ్‌ సుబ్రహ్మణి మూలిక వైద్యుడిగా నటించారు. కొండ ప్రాంతంలోని ప్రజలకు తన వైద్య సేవలను అందిస్తుంటాడు. అయితే ఒక సమస్య కారణంగా ఆ ప్రాంత ప్రజలు అతని వైద్యసేవలను పొందడానికి నిరాకరిస్తారు.

తను తయారుచేసిన మూలికల మందులు నిష్ప్రయోజనం కావడంతో వైద్యుడు ఆవేదనకు గురవుతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు వింతైన రోగం బారిన పడతారు. అయినప్పటికీ నాటు వైద్యున్ని ఆశ్రయించడానికి వెనకాడుతారు. కాగా వేరే గ్రామానికి చెందిన వ్యక్తి వచ్చి మూలిక వైద్యం పొందడం, అతను పూర్తిగా కోలుకోవడంతో ఆ గ్రామ ప్రజల్లో మార్పు వచ్చిందా? ఆ మూలిక వైద్యుడికి తలెత్తిన సమస్య పరిష్కారం అయ్యిందా అనే ఆసక్తికరమైన అంశాలతో మూలికల వైద్యం ప్రయోజనాలను ఆవిష్కరించే చిత్రంగా వెళ్లిమలై చిత్రం రూపొందింది. దీనికి పెరుమాళ్‌ చాయాగ్రహణం, ఎన్‌ఆర్‌.రఘునందన్‌ సంగీతాన్ని అందించారు. దీన్ని శక్తి ఫిలిమ్స్‌ సంస్థ ద్వారా శక్తివేల్‌ విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు