One By Two Review: ‘వన్ బై టు’మూవీ రివ్యూ

22 Apr, 2022 16:58 IST|Sakshi

టైటిల్‌: వన్ బై టు
నటీనటులు: సాయి కుమార్‌, ఆనంద్, శ్రీ పల్లవి , కాశీ విశ్వనాథ్, దేవీ ప్రసాద్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : చెర్రీ క్రియేటివ్ వర్క్స్ 
నిర్మాత:  శ్రీనివాసరావు
దర్శకుడు:  శివ ఏటూరి 
సంగీతం: లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సందీప్ కుమార్ కానుగల
ఎడిటర్: జేపీ
విడుదల తేది: ఏప్రిల్‌ 22,2022

గత రెండు నెలలుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హవే నడుస్తోంది. రాధేశ్యామ్‌  మొదలుకొని ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీయఫ్‌2.. ఇలా వరుస పాన్‌ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో చిన్న చిత్రాలు కాస్త వెనకడుగు వేశాయి. పాన్‌ ఇండియా ఫీవర్‌ ఇప్పుడు కాస్త తగ్గడంతో ఈ శుక్రవారం(ఏప్రిల్‌ 22) చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయడానికి వచ్చేశాయి. ఈ వారం టాలీవుడ్‌లో నాలుగైదు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి ‘వన్‌ బై టు’. డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ కీలక పాత్ర పోషించడం, టైటిల్‌ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో ‘వన్‌ బై టు’పై ఆసక్తి పెరిగింది. నేడు థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..?
హైదరాబాద్‌కు చెందిన పా​ండు(ఆనంద్‌) ఓ మధ్యతరగతికి చెందిన యువకుడు. జులాయిగా తిరుగుతూ.. తన కాలనీలోని అమ్మాయిలందరికి సైట్‌ కొడుతుంటాడు. అదే కాలనీకి తండ్రితో కలిసి వస్తుంది జెన్నీ(శ్రీపల్లవి). ఇంకేముంది.. ఆవారాగా తిరిగే పాండు.. జెన్నీ చూసి ప్రేమలో పడిపోతాడు. అందరి అమ్మాయిలను టైంపాస్‌గా లవ్‌ చేసే పాండు.. జెన్నీని మాత్రం సీరియస్‌గా ప్రేమిస్తాడు. కానీ జెన్నీ మాత్రం మొదట్లో పట్టించుకోకపోయినా... చివరకు పాండు ప్రేమను అంగీకరిస్తుంది. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ నిజాన్ని చెబుతుంది. అది విన్నాక పాండు జెన్నీని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అసలు జెన్నీ చెప్పిన నిజం ఏంటి? ప్రేమించిన అమ్మాయిని పాండు ఎందుకు వదులుకోవాలనుకున్నాడు? అసలు ఈ కథకు ‘వన్‌ బై టు’అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 ఎలా ఉందంటే..
ఇది ఒక వైలెంట్ లవ్ స్టొరీ అని చెప్పొచ్చు. దర్శకుడు శివ ఏటూరి ఓ ఢిఫెరెంట్‌ పాయింట్‌ని ఎంచుకొని ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అందులో కొంతవరకు సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. హిజ్రాలను బాధలను తెరపై చక్కగా చూపించాడు. తమిళ సినిమాల మాదిరి పాత్రలన్నీ చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌ అంతా సాదాసీదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్‌ స్టార్టింగ్‌లోనే ప్రేక్షకులకు ఓ భారీ ట్విస్ట్‌ ఇచ్చి షాకిచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? ఇప్పుడేం చేస్తాడు? అనే క్యూరియాసిటీ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే మధ్యలో వచ్చే కొన్ని సీన్స్‌ కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. బస్‌లో హిజ్రాని ఏడిపించే సీన్‌ చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. 

ఆకతాయిలను హీరో కొట్టకముందే.. హిజ్రా అతన్ని మెచ్చుకోవడం..హీరోయిన్‌ సెల్ఫీకి రెడీ అవడం అంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లోని కొన్ని సిల్లీ సీన్స్‌ని.. సెకండాఫ్‌తో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోయిన్‌ దుస్తులు ఆరేయడం నుంచి.. షాపులో షేవింగ్‌ కిట్‌ కొనే వరకు ప్రతి సీన్‌కి సెండాఫ్‌లో కారణం చూపించాడు.  విజయ భారతి రాసిన ‘నొప్పి తెలియకుండా మనిషిని సక్కగా చేయటానికి నేను డాక్టర్ ని కాదు, రోజుకొకలా హింసించే యమధర్మరాజుని’లాంటి డైగాల్‌ బాగా పేలింది. సాయికుమార్‌, దేవీప్రసాద్‌, కాశీ విశ్వనాథ్‌ లాంటి సీనియర్‌ నటులను మరింత వాడుకోని, ఫస్టాఫ్‌పై ఇంకాస్త ఫోకస్‌ పెడితే సినిమా ఫలితం వేరేలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
ఆవారాగా తిరిగే మధ్య తరగతికి చెందిన యువకుడు పాండు పాత్రకు ఆనంద్‌ న్యాయం చేశాడు. అతని యాక్టింగ్‌ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. తనదైన కామెడీతో నవ్వించాడు కూడా. ఇక హీరోయిన్‌ శ్రీపల్లవి అయితే జెన్నీ పాత్రకు పూర్తి న్యాయం చేసింది.ఎవరైనా మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయారు. హీరోయిన్ తండ్రి గా కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. కొడుకు ప్రేమను అర్థం చేసుకునే మధ్యతరగతి తండ్రిగా దేవీప్రసాద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి సంగీతం ఫర్వాలేదు.సందీప్ కుమార్ కానుగల నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్‌ జేపీ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు