ఆర్‌. నారాయణమూర్తి సినిమాకు 25 ఏళ్లు

9 Nov, 2020 00:46 IST|Sakshi

మరపురాని చిత్రం –ఒరేయ్‌ రిక్షా! @ 25

సిల్వర్‌ జూబ్లీ హిట్‌

పాతికేళ్ళ తరువాత కూడా ఒక సినిమా గుర్తుందంటే... అందులోని పాత్రలు, పాటలు, అభినయం గుర్తున్నాయంటే.. ఆ సినిమా కచ్చితంగా ప్రత్యేకమే. దాసరి నారాయణరావు నిర్మాతగా, దర్శకుడిగా తన శిష్యుడు ఆర్‌. నారాయణమూర్తి హీరోగా రూపొందించిన ‘ఒరేయ్‌ రిక్షా’ ఆ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇవాళ్టికి ఈ సినిమాకు పాతికేళ్ళు.

సరిగ్గా పాతికేళ్ళ క్రితం 1995. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావుకు ఎందుకో కాలం కలసిరాలేదు. వరుసగా కొన్ని ఫ్లాపులు. ఆర్థికంగా అనుకోని ఆటుపోట్లు! గతంలో ఆయనతో హిట్లు సాధించిన అగ్ర హీరోలు కూడా ఆ సమయంలో డేట్లు ఖాళీ లేవంటూ బిజీ మంత్రం పఠించసాగారు. సరిగ్గా అప్పుడే ఆయనకు తన శిష్యుడు ఆర్‌. నారాయణమూర్తి, అతని కోసం గతంలో తాను అనుకున్న ఓ మదర్‌ సెంటిమెంట్‌ కథ గుర్తొచ్చాయి.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..: అంతకుముందు కొన్నేళ్ళ క్రితం దాసరి ఓ తల్లి సెంటిమెంట్‌ కథ అనుకున్నారు. అప్పట్లో సామాజిక విప్లవ కథాంశాలతో ముందుకొస్తున్న టి. కృష్ణ దర్శకుడిగా, ఆర్‌. నారాయణమూర్తి హీరోగా దాసరి ఆ కథను నిర్మించాలనుకున్నారు. టి. కృష్ణతో మాట్లాడారు కూడా. అంతా ఓకే. కానీ, బిజీగా ఉన్న టి. కృష్ణ క్యాన్సర్‌ బారిన పడి కన్నుమూశారు. ఇప్పుడు టి. కృష్ణ లేరు. కానీ, ఆర్‌. నారాయణమూర్తి నమ్మినబంటులా గురువు గారి కోసం సిద్ధంగా ఉన్నారు. నిజానికి, ఈ మధ్య గ్యాప్‌లో నారాయణమూర్తి నిర్మాతగా, దర్శకుడిగా మారి, ‘అర్ధరాత్రి స్వతంత్రం, ఎర్రసైన్యం’ లాంటి వరుస విప్లవ సినిమాలు తీశారు. ఆ భారీ ఘన విజయాలతో ‘పీపుల్స్‌ స్టార్‌’ హీరోగా ఎదిగి, బిజీగా ఉన్న నారాయణమూర్తిని గురువు దాసరి పిలిచారు. గురువు గారి కోసం పైసా పారితోషికం లేకుండా, ఏం చేయడానికైనా శిష్యుడు సిద్ధమయ్యారు. మునుపటి తల్లీ కొడుకుల కథలో మరిన్ని అంశాలు జొప్పించి, లీడర్‌ వర్సెస్‌ క్యాడర్‌ అనేది ప్రధానాంశంగా, సినిమా తీద్దామన్నారు దాసరి. అలా దాసరి తన పేరు మీద దాసరి ఫిలిమ్‌ యూనివర్సిటీ పతాకం స్థాపించి, ఆ బ్యానర్‌పై తొలి సినిమాగా తీసిన చిత్రం ‘ఒరేయ్‌ రిక్షా’.
సమకాలీన సామాజిక ఘటనలతో..: అంతకు ముందు వేషాల కోసం మద్రాసు వచ్చిన ఆర్‌. నారాయణమూర్తికి చిన్న వేషాలతో సినీజీవితమిచ్చిన దాసరి, కాలం మారి తన శిష్యుడు స్టార్‌ అయ్యాక, అడిగి హీరోగా పెట్టి మరీ తీసిన ఏకైక సినిమా ఇది. ఒక రాజకీయ నేత చెప్పిన మాటలు నమ్మి, అతని కోసం తన వాళ్ళతో ఓట్లన్నీ వేయించి, క్యాడర్‌గా ఒక రిక్షా కార్మికుడు శ్రమిస్తే, చివరకు ఆ లీడరే ఆ క్యాడర్‌ అందరినీ మోసం చేస్తే ఏమైందనేది కథాంశం. రాజకీయ నేతలు, పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ గనక ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడకపోతే, యువతరం మరో మార్గం లేక తుపాకీ పట్టుకొని అడవుల్లోకి పోవాల్సి వస్తుందని సినిమాలో చెప్పారు దాసరి. రిక్షా కార్మికుడు సూర్యంగా ఆర్‌. నారాయణమూర్తి, అతని భార్యగా రవళి, అతని చెల్లెలిగా మధురిమ (నటి ప్రభ మేనకోడలు), తల్లిగా శివపార్వతి, రాజకీయ నేతగా రఘునాథరెడ్డి నటించారు. నారాయణమూర్తి ప్రభృతుల అభినయం, నాటక రచయిత సంజీవి రాసిన పదునైన మాటలు, ముక్కురాజు కొరియోగ్రఫీ – ఇవన్నీ ‘ఒరేయ్‌ రిక్షా’ను పైయెత్తున నిలిపాయి.

నీ పాదం మీద పుట్టుమచ్చనై..: దాసరితో సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ పనిచేసిన తొలి చిత్రం ఇదే. ఆ తరువాత ఆ కాంబినేషన్లో ‘ఒసేయ్‌ రాములమ్మా’ సహా పలు చిత్రాలు వచ్చాయి. విప్లవ గాయకుడు గద్దర్‌ తాను రాసిన ‘రక్తంతో నడుపుతాను రిక్షాను..’ సహా పలు ప్రైవేట్‌ జనగీతాలను ఈ సినిమాలో వాడుకొనేందుకు అనుమతినిచ్చారు. ఆత్మీయుడు ఆర్‌. నారాయణమూర్తి కోసం పారితోషికమైనా తీసుకోలేదు. ఈ సినిమాలో ‘రక్తంతో నడుపుతాను.., జాగోరే జాగో జాగో.., జాతరో జాతర..’ – ఇలా అన్ని పాటలూ హిట్‌. అన్నాచెల్లెళ్ళ అనుబంధమూ కీలకమైన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’ అనే పాట రాసి ఇచ్చారు గద్దర్‌. ఈ పాట చిరస్థాయిగా నిలిచింది. ఆ పాట రాసిన గద్దర్‌కూ, పాడిన ‘వందేమాతరం’ శ్రీనివాస్‌కూ ఇద్దరికీ ప్రభుత్వం ఆ ఏడాది నంది అవార్డులు ప్రకటించింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో గద్దర్‌ ఆ అవార్డును తిరస్కరించడం వేరే కథ.

మరపురాని గురుదక్షిణ: పూర్తిగా తిరుపతి పరిసరాల్లో, కొంత మద్రాసులో చిత్రీకరణ జరుపుకొన్న ‘ఒరేయ్‌ రిక్షా’ అప్పట్లో పెద్ద సంచలనం. పాతికేళ్ళ క్రితం 1995 నవంబర్‌ 9న రిలీజైన ఈ చిత్రం సిల్వర్‌ జూబ్లీ హిట్‌గా నిలిచింది. పేరుతో పాటు పైసలూ తెచ్చింది. మచ్చుకు చెప్పాలంటే – షూటింగ్‌ వేళ గురువు గారికి ఇబ్బంది లేకుండా, ఈస్ట్‌ గోదావరి రైట్స్‌ కోసమంటూ 20 లక్షలు ముట్టజెప్పారు నారాయణమూర్తి. సినిమా విడుదలయ్యాక ఏకంగా అక్కడ 60 లక్షలు వసూలు చేసింది. మళ్ళీ దాసరికి కొత్త ఊపు తెచ్చింది. సాక్షాత్తూ దాసరి సతీమణి పద్మ సైతం ‘‘మీ గురువు ఋణం తీర్చుకున్నావయ్యా. మళ్ళీ మీ గురువును నిలబెట్టావయ్యా’’ అని తనతో అన్న విషయాన్ని ‘పీపుల్స్‌ స్టార్‌’ ఇప్పటికీ చెమర్చిన కళ్ళతో గుర్తు చేసుకుంటారు.

తరువాత దాసరి ‘ఒసేయ్‌ రాములమ్మా’ లాంటి మరో ఆల్‌ టైమ్‌ హిట్‌ తీయడం వెనుక ‘ఒరేయ్‌ రిక్షా’ ప్రభావం కనిపిస్తుంది. బడుగు, బలహీన వర్గాల ఆత్మాభిమానాన్నీ, ఆత్మగౌరవాన్నీ చాటిచెప్పిన ఈ రెండు చిత్రాలూ దాసరి కెరీర్‌లో మైలురాళ్ళుగా మిగిలిపోయాయి. సాక్షాత్తూ దాసరి సైతం హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో కృష్ణ, నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డి సమక్షంలో ‘‘విప్లవ సినిమాలు తీయడం ఓ ముళ్ళబాట. ఆ ముళ్ళబాటను సరిచేసి, రాస్తాగా మార్చాడు నా బిడ్డ ఆర్‌. నారాయణమూర్తి. ఆ రాస్తాలో ఇవాళ నేను, అనేకమంది పయనిస్తున్నాం’’ అని సభాముఖంగా మెచ్చుకోవడం గురువు ముఖతః శిష్యుడికి దక్కిన ఓ అపూర్వ గౌరవం. ఓ శిష్యుడు చెల్లించిన గురుదక్షిణగా చరిత్రలో మిగిలిపోయిన చిత్రం – ‘ఒరేయ్‌ రిక్షా’.         
– రెంటాల జయదేవ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు