Oscar 2022-Indian Fans Fire: ఆస్కార్‌ అవార్డు కమిటీపై ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌, కారణం ఇదే

29 Mar, 2022 08:14 IST|Sakshi

ప్రతిష్టాత్మక ఆస్కార్‌  అవార్డులు 2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనీ ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్‌ రాక్‌ చెంపను విల్‌ స్మిత్‌ పగలగొట్టడం లాంటి చిన్న చిన్న వివాదాలు మినహా.. కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే  ఆస్కార్‌ అవార్డు కమిటీపై ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా.. ఆస్కార్‌ అవార్డ్స్‌ ‘ఇన్‌ మెమోరియమ్‌’ విభాగంలో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌ పేర్లను ప్రస్తావించకపోవడమే.

93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ (2021) సమయంలో రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌లకు ఆస్కార్‌ ‘ఇన్‌ మెమోరియమ్‌’లో స్థానం కల్పించిన నేపథ్యంలో ఈ ఏడాది లతా మంగేష్కర్, దిలీప్‌ కుమార్‌లను విస్మరించడంతో ఆస్కార్‌ కమిటీ మెమరీ (జ్ఞాపక శక్తి) లో వీళ్లిద్దరూ లేరా? అనే చర్చ మొదలైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ వచ్చిన చిత్రాలకు ఆస్కార్‌ బరిలో నిలిచే అవకాశం ఉంది. ‘ఇన్‌ మెమోరియమ్‌’ని కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే... లతా మంగేష్కర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు కాబట్టి ఆమె పేరుని ప్రస్తావించలేదని ఆస్కార్‌ వివరణ ఇచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది జూలైలో మరణించిన దిలీప్‌ కుమార్‌ని అయినా ప్రస్తావించాలి కదా.. సో.. ఆస్కార్‌ చేసినది ముమ్మాటికీ తప్పిదమే అన్నది నెటిజన్ల మాట. 

మరిన్ని వార్తలు