ఇది ఆస్కార్‌ శాపం అన్నారు

28 Jul, 2020 03:42 IST|Sakshi
సౌండ్‌ డిజైనర్‌ రెసూల్‌పూకుట్టి

‘‘ఆస్కార్‌  గెలిచిన తర్వాత బాలీవుడ్‌ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను’’ అన్నారు సౌండ్‌ డిజైనర్‌ రెసూల్‌ పూకుట్టి. ఇటీవలే సంగీత దర్శకుడు రెహమాన్‌ హిందీలో తనకు సినిమాలు రానీయకుండా ఓ గ్యాంగ్‌ పని చేస్తోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘నాకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది’’ అని తెలిపారు రెసూల్‌.

ఈ విషయాన్ని ట్వీటర్‌ లో ప్రస్తావిస్తూ – ‘‘ఆస్కార్‌ విజయం తర్వాత బాలీవుడ్‌ వారు సినిమాలు ఇవ్వకపోయినా ప్రాంతీయ సినిమా నన్ను బాగా గౌరవించింది.. హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు ‘నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు’ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని హాలీవుడ్‌ కి వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ వెళ్లలేదు, వెళ్లే ఆలోచన కూడా లేదు. నాకు ఆస్కార్‌ తెచ్చిపెట్టింది ఇండియన్‌ సినిమానే.

అవకాశాలు రాని విషయం గురించి ఓ సందర్భంలో ఆస్కార్‌ అకాడమీ వాళ్లతో మాట్లాడితే ఆస్కార్‌ పొందినవారికి ఎదురయ్యే సమస్య ఇదే అని, ఇది ఆస్కార్‌ శాపమని చెప్పారు. అయినా ఆస్కార్‌ గెలిచి గాల్లో తేలుతూ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా రిజెక్ట్‌ చేయడాన్ని మించిన రియాలిటీ చెక్‌ ఉంటుందా? ఏది ఏమైనా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. నన్ను నమ్మేవాళ్లు, నా పనిని గౌరవించేవాళ్లు కొంతమంది ఉన్నారు. వారు నన్ను గౌరవిస్తారు.. నమ్ముతారు’’ అని పలు ట్వీట్స్‌ లో రాసుకొచ్చారు రెసూల్‌ పూకుట్టి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు