Oscar Awards 2023: ఆ 'చెంపదెబ్బ' అంత పని చేసిందా.. రెడ్‌ కార్పెట్‌ మార్పుపై వ్యం‍గ్యాస్త్రాలు

12 Mar, 2023 19:15 IST|Sakshi

మరికొన్ని గంటల్లో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేడుక జరగబోతోంది. అయితే ఈ వేడుకపై టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పేరు విశ్వవేదికపై మార్మోగనుంది. అయితే ఆస్కార్ వేదికపై నడవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ఎందుకంటే రెడ్ కార్పెట్‌పై నడవడాన్ని అరుదైన అవకాశంగా భావిస్తారు. కానీ ఈ ఏడాది ఆ రెడ్‌ కార్పెట్ వేదికపై కనిపించకపోవడం ఆశ్చర్యం కలిస్తోంది. 

60 ఏళ్ల సంప్రదాయానికి చెక్

అయితే ఈసారి ఆస్కార్ వేడుకల్లో రెడ్‌ కార్పెట్ కనిపించడం లేదు. తొలిసారి రెడ్‌ కార్పెట్‌ కలర్‌ను మార్చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడాది షాంపైన్ కలర్‌లో స్వాగతం పలకనున్నారు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఈసారి బ్రేక్ చేయడం విశేషం. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. రంగు మార్చడం వెనుక ఉద్దేశంపై ఓ సీరియస్ జోక్‌ వేసింది అకాడమీ. ఓసారి అదేంటో తెలుసుకుందాం. 

విల్‌స్మిత్‌ చెంపదెబ్బే కారణం

అయితే గతేడాది జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో అత్యంత వివాదాస్పద ఘటన విల్‌స్మిత్‌ చెంపదెబ్బ. గతేడాది జరిగిన ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్‌రాక్‌ వ్యవహారశైలికి మండిపడ్డ విల్‌స్మిత్‌ వేదికపైనే ఆయనపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో వేదికపై ఉన్నవారితో పాటు,  కోట్లాది మంది అభిమానులు  ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఆ ఘటనను గుర్తు చేస్తూ కలర్ మార్చడంపై అకాడమీ వ్యంగ్యంగా స్పందించింది. 

అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు హోస్ట్‌గా అమెరికన్ కామెడియన్ జిమ్మీ కిమ్మెల్ వ్యవహరిస్తున్నాడు. రెడ్‌ కార్పెట్ కలర్ మార్పుపై మాట్లాడుతూ. 'గత ఏడాది హాస్యనటుడు క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడంతో ఆస్కార్ అకాడమీ ఒక్కసారిగా ఎరుపెక్కింది. అందుకనే ఈ సంవత్సరం 60 ఏళ్ల సంప్రదాయాన్ని రెడ్ నుంచి షాంపైన్‌కు మారుస్తున్నాం. దీనివల్ల ఇక అలాంటి చెంపదెబ్బలు ఉండవని భావిస్తున్నాం.' అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. 

అప్పుడు అసలేం జరిగిందంటే..

కాగా గతేడాది విల్ స్మిత్ భార్య హెల్త్ గురించి హాస్యనటుడు క్రిస్ రాక్‌ జోక్ చేస్తూ మాట్లాడడం వివాదానికి దారితీసింది. దీంతో విల్‌స్మిత్ స్మిత్ కోపం వచ్చి క్రిస్ రాక్‌పై చెంపదెబ్బ వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అకాడమీ.. విల్ స్మిత్‌పై పదేళ్లు బ్యాన్ కూడా విధించింది. అందువల్లే ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు జరగకుండా అకాడమీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. 

(ఇది చదవండి: వామ్మో.. ఆస్కార్‌ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్‌ ఏంటంటే..)

నేనేమీ ఏడవడం లేదు: క్రిస్ రాక్

ఆ సంఘటన ఇప్పటికీ తనని బాధిస్తోందని ఇటీవల క్రిస్‌ రాక్‌ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ..'ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏడాది కిందట నేను చెంపదెబ్బ తిన్నా. అందరి ముందు విల్ స్మిత్ నన్ను కొట్టాడు. ఆ సంఘటన మిమ్మల్ని బాధించిందా’ అని కొంతమంది నన్ను అడిగారు. ఇప్పటికీ నేను బాధపడుతున్నా. అయితే అందుకు నేనేమీ ఏడవడం లేదు.' క్రిస్‌ రాక్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు