ఆస్కార్‌ సంబరాలు ఆరంభం.. ‘లంచ్‌ మీట్‌’లో పాల్గొన్న కీరవాణి, చంద్రబోస్‌

15 Feb, 2023 01:05 IST|Sakshi

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి దాదాపు నెల రోజులు ఉంది. ఈలోపు ఎప్పటిలానే ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్నవారికి ‘లంచ్‌ మీట్‌’ ఏర్పాటు చేసింది అవార్డ్‌ కమిటీ. ఈ విందుకి సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్‌ హాజరయ్యారు. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు కమిటీ నుంచి విందు కార్యక్రమానికి ఆహ్వానం అందగా ఈ ఇద్దరూ వెళ్లారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని నిర్మించారు. ఇక ‘లంచ్‌ మీట్‌’ విషయానికొస్తే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ది బెవర్లీ హిల్టన్‌ బాల్‌ రూమ్‌లో విందు కార్యక్రమం జరిగింది. ఈ విందులో దాదాపు 200మంది పాల్గొన్నారని సమాచారం. అక్కడ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ను కలిశారు కీరవాణి, చంద్రబోస్‌. ఆ ఫోటోలను చంద్రబోస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

హుందాగా ఉందాం: జానెట్‌ యాంగ్‌ 
గత ఏడాది జరిగిన ఆస్కార్‌ అవార్డుల వేడుకకు ఓ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్‌ రాక్‌ ఆ వేదికపై నటుడు విల్‌ స్మిత్‌ భార్య జాన్‌ పిన్‌కెట్‌ హెయిర్‌ స్టయిల్‌ గురించి కామెడీగా మాట్లాడారు. అది నచ్చక విల్‌స్మిత్‌ అతన్ని చెంపదెబ్బ కొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రపంచం మొత్తం చూస్తున్న వేడుకలో విల్‌ స్మిత్‌ ఇలా చేయడం సరికాదని అవార్డు కమిటీ భావించింది.

ఇదే విషయం గురించి తాజాగా ‘లంచ్‌ మీట్‌’లో అకాడమీ చైర్మన్‌ జానెట్‌ యాంగ్‌ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. గత ఏడాది ఆస్కార్‌ వేడుకలో జరిగిన ఘటన (క్రిస్‌ని విల్‌ చెంప చెళ్లుమనిపించడం) సరైనది కాదు. అందరం బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను ఆస్కార్‌ కమిటీ ఉపేక్షించదు’’ అన్నారు. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని ఆస్వాదించా! 
ఈ నెల 17న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ‘యాంట్‌–మ్యాన్‌ మరియు ది వాస్ప్‌: క్వాంటుమేనియా’లో సూపర్‌ విలన్‌ కాంగ్‌ ది కాంకరర్‌ పాత్ర చేసిన జోనాథన్‌ మేజర్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి మాట్లాడుతూ– ‘‘నేను భారతీయ చిత్రానికి అభిమానిని. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని చాలాసార్లు చూశాను. మూడు గంటల ఈ సినిమాని ఆస్వాదించాను. ఇద్దరు నటులను  (ఎన్టీఆర్, రామ్‌చరణ్‌) తెరపై చూడటం నాకు చాలా నచ్చింది. మరిన్ని ఇండియన్‌ సినిమాలు చూడాలనుకుంటున్నాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు