అందుకే... ఆస్కార్‌ క్రైసిస్‌ టీమ్‌ 

25 Feb, 2023 01:19 IST|Sakshi

గత ఏడాది జరిగిన 94వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో హోస్ట్‌ క్రిస్‌ రాక్, నటుడు విల్‌ స్మిత్‌ల మధ్య జరిగిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వేదికపై తన భార్య, నటి జడా పింకెట్‌ స్మిత్‌పై క్రిస్‌ రాక్‌ జోక్స్‌ వేయడాన్ని సంహించలేకపో యిన విల్‌ స్మిత్‌ అందరూ చూస్తుండగానే క్రిస్‌రాక్‌ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన ఆస్కార్‌ చరిత్రలో ఓ బ్లాక్‌మార్క్‌గా నిలిచిపో యిందని కమిటీ పేర్కొంది. 94వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో విల్‌ స్మిత్‌ బెస్ట్‌ యాక్టర్‌గా నిలిచారు.

అయితే ఈ విషయం కన్నా ఎక్కువగా క్రిస్‌ రాక్‌పై చేయి చేసుకున్న  విషయంలోనే వార్తల్లో నిలిచారు విల్‌ స్మిత్‌. ఈ నేపథ్యంలో పదేళ్ల పాటు ఆస్కార్‌ అవార్డు వేడుకలకు విల్‌ స్మిత్‌ హాజరు కాకుండా నిషేధం విధించింది కమిటీ. ఇక ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేలా, ఒకవేళ జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా ఈసారి ఆస్కార్‌ నిర్వాహకులు ‘క్రైసిస్‌ టీమ్‌’ను ఏర్పాటు చేయనున్నారు. 94ఏళ్ల ఆస్కార్‌ అవార్డు చరిత్రలో ఇలా ఒక టీమ్‌ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

‘‘గత ఏడాది జరిగిన ఆస్కార్‌ వేడుకలో జరిగిన ఓ ఘటన (విల్‌ స్మిత్‌ – క్రిస్‌ రాక్‌లను ఉద్దేశిస్తూ..) మమ్మల్ని కొత్తగా ఆలోచించేలా, సరికొత్త నిర్ణయాలు తీసుకునేలా చేసింది. ఇందులో భాగంగానే క్రైసిస్‌ కమ్యూనికేషన్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ బృంద సభ్యులు అందుకు తగ్గట్లుగా త్వరితగతిన స్పందిస్తారు.

ఈ క్రైసిస్‌ మెంబర్స్‌ సేవలు వినియోగంలోకి  రాకూడదనే (ఆస్కార్‌ వేడుక సవ్యంగా  జరగాలని ఆశిస్తూ...) కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు ఆస్కార్‌ కొత్త సీఈఓ బిల్‌ క్రామెర్‌. ఇక 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న జరగనుంది. అలాగే బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు