ఆస్కార్‌... ఆశ్చర్యం

26 Mar, 2022 05:32 IST|Sakshi

కోవిడ్‌ కారణంగా గత రెండు అస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఊహించినంత ఉత్సాహం కనబడలేదు. పైగా ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రోగ్రామ్‌ రేటింగ్‌ కూడా పడిపోయింది. వీటికి తోడు ఈసారి ఆస్కార్‌ అవార్డుల్లోని 8 విభాగాలకు ముందుగానే అవార్డులు ఇచ్చి, ఆ ఫుటేజీని లైవ్‌ టెలికాస్ట్‌ రోజు ప్రదర్శించాలని ఆస్కార్‌ నిర్వాహకులు ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. రేటింగ్‌ను పెంచడం, విమర్శలను తగ్గించుకోవడం కోసం ఆస్కార్‌ నిర్వాహకులు కొన్ని సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేశారట.

ఇందులో భాగంగా క్లాసిక్‌ చిత్రాలను సెలబ్రేట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘జేమ్స్‌బాండ్‌’ సిరీస్‌లోని తొలి సినిమా ‘డాక్టర్‌ నో’ (1962) విడుదలై 60 సంవత్సరాలు కావస్తోంది. అలాగే మరో హాలీవుడ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ ‘గాడ్‌ ఫాదర్‌’ (1972) చిత్రం యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ 94వ ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకలో ఈ రెండు చిత్రాలను సెలబ్రేట్‌ చేసే విధంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు ఆస్కార్‌ నిర్వాహకుల్లో ఒకరైన విల్‌ పాకర్‌ పేర్కొన్నారు. ఈ సర్‌ప్రైజెస్‌ ఏంటి? అనేవి మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. ఈ నెల 27న లాస్‌ ఏంజిల్స్‌లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు