Oscars Awards 2023: సత్తా చాటిన తెలుగోడి సినిమా.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!

13 Mar, 2023 08:59 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. 

లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్‌ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.  అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్‌ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు.

ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్‌లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ను దక్కించుకుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు