Heroines Entry To Tollywood Movies: తెలుగులో పరిచయం కానున్న పర భాష హీరోయిన్లు

2 Apr, 2022 07:46 IST|Sakshi

పేరులోనే శుభాన్ని మోసుకొచ్చింది ఉగాది.. ఇది ‘శుభకృత్‌’ నామ సంవత్సరం.. శుభకృత్‌ అంటే ‘మంచి చేసేది’ అని అర్థం. మంచే జరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన వేళ. తెలుగు చిత్రసీమ కూడా కొత్త కథానాయికలను ‘శుభమస్తు’ అంటూ ఆహ్వానిస్తోంది. కొత్త తెలుగు సంవత్సరంలో పలువురు నాయికలు పరిచయం కానున్నారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం.  

ముంబై బ్యూటీలు తెలుగు తెరపై మెరవడం కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతోమంది హిందీ భామలు ఇక్కడ నిరూపించుకున్నారు. తాజాగా కొందరు ముంబై సే ఆయా (ముంబై నుంచి వచ్చారు). వీళ్లల్లో ఆల్రెడీ హిందీలో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్న దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కానున్నారు. దీపికా అనగానే చాలామంది బాలీవుడ్‌ హీరోయిన్‌ అనే అనుకుంటారు. కానీ హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ మొదలైంది ఉపేంద్ర హీరోగా 2006లో విడుదలైన కన్నడ ఫిల్మ్‌ ‘ఐశ్వర్య’తోనే. ఈ సినిమా తర్వాత దీపికా హిందీలో చేసిన ‘ఓం శాంతి ఓం’ అద్భుత విజయం సాధించడంతో బాలీవుడ్‌లోనే సెటిలైపోయారు ఈ మంగుళూరు బ్యూటీ. అయితే 2007లో రజనీకాంత్‌ చేసిన తమిళ ఫిల్మ్‌ ‘కొచ్చయాడన్‌’తో మళ్లీ సౌత్‌లో నటించారు. అయితే అది యానిమేషన్‌ మూవీ కాబట్టి.. ఎక్కువ రోజులు పని చేయలేదామె. ఎనిమిదేళ్ల తర్వాత సౌత్‌లో ‘ప్రాజెక్ట్‌ కె’లో భాగమయ్యారు. దీపికా పదుకొణెకు తెలుగులో ఇదే తొలి సినిమా. ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రధారిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. 

ఇక 2019లో హిందీలో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ ఆరంభించిన అనన్య పాండే ‘లైగర్‌’తో తెలుగువైపు అడుగులు వేశారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్‌ కానుంది. ఇంకోవైపు బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందిన మరో ఫిల్మ్‌ ‘గని’తో తెలుగు గడప తొక్కారు సయీ మంజ్రేకర్‌. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ‘గని’ చిత్రంలో సయీ మంజ్రేకర్‌ ఓ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌లో వెబ్‌ సిరీస్‌లు, సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న మిథిలా పాల్కర్‌ తెలుగుకి వచ్చారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా..’ చిత్రంలో తెలుగు తెరపై కనిపించనున్నారామె. తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘ఓ మై కడవులే..’కి ఇది తెలుగు రీమేక్‌. 

ఒకే సినిమాతో ఇరువురు భామలు 
ఒకే సినిమా (‘టైగర్‌ నాగేశ్వరరావు’)తో ఇద్దరు బ్యూటీలు పరిచయం కానున్నారు. నూపుర్‌ సనన్, గాయత్రి భరద్వాజ్‌ ఈ చిత్రంలో కథానాయికలు. టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ హీరోగా పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఉగాది పర్వదినానా (శనివారం) ఆరంభమైంది. ఇంతకీ నూపుర్‌ సనన్‌ ఎవరంటే.. ఇప్పటికే నార్త్, సౌత్‌లో స్టార్‌ అనిపించుకున్న కృతీ సనన్‌ చెల్లెలు. మరో భామ గాయత్రీ భరద్వాజ్‌ ఎఫ్‌బీబీ కలర్స్‌ ఫెమినా మిస్‌ ఇండియా యునైటెడ్‌ కాంటినెంట్స్‌ 2018, సెఫోరా మిస్‌ గ్లామరస్, జియో మిస్‌ పాపులర్‌ ఇలా పలు టైటిల్స్‌ను గెల్చుకున్నారు. 

ఫ్రమ్‌ ఫారిన్‌ 
తమిళ హీరో శివకార్తికేయన్‌ కోసం ఉక్రెయిన్‌ నుంచి వచ్చారు మరియా ర్యాబోషప్క. కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఉక్రెయిన్‌ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటిస్తున్నారు. ఇక నాగశౌర్య కోసం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు న్యూజిల్యాండ్‌ బ్యూటీ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రంలో షిర్లే సేథియా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్‌ కానుంది. 

మాలీవుడ్‌ టు టాలీవుడ్‌ 
మలయాళంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా నజీమ్‌ సుందరం కోసం తెలుగుకి వచ్చారు. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అంటే... సుందరానికీ’ చిత్రంలో నజ్రియా కథానాయికగా నటిస్తున్నారు. మరోవైపు మాలీవుడ్‌లో దూసుకెళ్తోన్న సంయుక్తా మీనన్‌ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ధనుష్‌ హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్‌’ (తమిళంలో ‘వాతి’)లో సంయుక్తా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. అలాగే కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న టైమ్‌ ట్రావెల్‌ ఫిల్మ్‌లో సంయుక్త హీరోయిన్‌గా కనిపిస్తారు. అంతే కాదండోయ్‌.. మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఓ కీ రోల్‌ చేస్తున్నారీ బ్యూటీ. 

ఇక మరో పాపులర్‌ మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మీ సైతం తెలుగులో నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేశ్‌ కాంబినేషన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన చిత్రం ‘గాడ్సే’. ఈ చిత్రంతో ఐశ్వర్యా లక్ష్మీ తెలుగులో తొలి అడుగు వేశారు. వీరితో పాటు అనిఖా కృష్ణన్‌ కూడా తెలుగుకు హాయ్‌ చెబుతున్నారు. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘కప్పెలా’ తెలుగు రీమేక్‌ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్‌ టైటిల్‌)లో అనిఖా నటిస్తున్నారు. ఇందులో విశ్వక్‌ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హీరోలు. 

ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదికి దాదాపు పది మంది కథానాయికలు తెలుగుకి వస్తున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా తెలుగులో పరిచయమై ప్రతిభను నిరూపించుకునేందుకు కథలు వింటున్నారు.  

మరిన్ని వార్తలు