Paagal Review: పాగల్‌ మూవీ ఎలా ఉందంటే..

14 Aug, 2021 12:15 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : పాగల్‌
జానర్‌ : రొమాంటిక్‌ కామెడీ
నటీనటులు : విశ్వక్‌ సేన్‌,  నివేదా పేతురాజ్‌ , సిమ్రాన్‌ చౌదరి, మేఘలేఖ, మురళీశర్మ, రాహుల్‌ రామకృష్ణ  తదితరులు
నిర్మాణ సంస్థ :  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌,  లక్కీ మీడియా
నిర్మాతలు : బెక్కెం వేణుగోపాల్‌
దర్శకత్వం:   నరేష్‌ కుప్పిలి
సంగీతం :  రధన్‌
సినిమాటోగ్రఫీ : ఎస్‌. మణికందన్ 
విడుదల తేది : ఆగస్ట్‌ 14,2021

టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ‘వెళ్లిపోమాకే’ తో తెలుగు సినిమాకు పరిచయమైన విశ్వక్ సేన్ తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ఫలక్‌నుమా దాస్‌లో నటించి నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఇక ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు. ఇలా వైవిధ్యమైన సినిమాను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విశ్వక్‌.. తాజాగా నటించిన చిత్రం ‘పాగల్‌’.

ఇందులో విశ్వక్‌ సేన్‌ ప్రేమికుడిగా కనిపించడం, దిల్‌ రాజ్‌ ఈ సినిమాను సమర్పిస్తుండడంతో ‘పాగల్‌’పై  పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది.  దీనికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో పాటు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో  సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మాస్‌కా దాస్’అందుకున్నాడా? లేదా? ‘పాగల్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ
ప్రేమ్‌(విశ్వక్‌ సేన్‌)కు తన తల్లి (భూమిక)అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో అమ్మలాగా ఎవరూ ప్రేమించలేరని నమ్ముతాడు.  అయితే తన ఏడేళ్ల వయసులో తల్లిని కోల్పోతాడు ప్రేమ్‌. అమ్మ ప్రేమకి దూరమై ప్రేమ్‌కి ఆ ప్రేమని పొందాలంటే అమ్మాయి వల్లే సాధ్యమని తన స్నేహితుడు సలహా ఇస్తాడు. ప్రేమలో ఏమీ ఆశించకూడదు అని చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలను కూడా ప్రేమ్‌ మనసులో పెట్టుకొని కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్‌ చేస్తాడు. నన్ను ప్రేమిస్తే అమ్మలా చూసుకుంటానంటూ.. అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు. కానీ అందరూ ప్రేమ్‌ ప్రేమని తిరస్కరిస్తారు.

కొంతమంది అమ్మాయిలు డబ్బు కోసం అతన్ని వాడుకొని వదిలేస్తారు. ఇలా ప్రేమలో విఫలం అయినా ప్రేమ్‌.. చివరకు రాజకీయ నాయకుడు రాజిరెడ్డి అలియాస్‌ రాజీ (మురళీశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను లవ్‌ చేయమని రాజీ చుట్టూ తిరుతాడు. పురుషుడైన రాజీని ప్రేమ్‌ ఎందుకు లవ్‌ చేశాడు? ప్రేమ్‌కి జీవితంలోకి తీర(నివేతా పేతురాజ్‌) ఎలా వచ్చింది? అమ్మ ప్రేమ కోసం వెతికిన ప్రేమ్‌కి చివరకు అలాంటి ప్రేమ దక్కిందా? లేదా? అనేదే మిగతా కథ

నటీ, నటులు
లవర్‌ బాయ్‌ ప్రేమ్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. తీర పాత్రకి నివేతా పేతురాజ్‌ న్యాయం చేసింది. నిడివి తక్కువే అయినా ఉన్నంత సేపు తెరపై అందంగా కనిపించింది. ఇక విశ్వక్‌ సేన్‌ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. ఎమ్మెల్యే అభర్థిగా పోటీ చేస్తూ.. ప్రేమ్‌ పెట్టే ప్రేమ టార్చర్‌ని భరిస్తూ అద్భుత కామెడీని పండించాడు. రాహుల్‌ రామకృష్ణ, మహేశ్‌లు కామెడీతో మెప్పించారు. సిమ్రాన్‌ చౌదరి, మేఘలేఖ తదితరులు తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ
తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెతికే ఓ యువకుడి కథే ‘పాగల్‌’.‘ మనం ఎవర్ని ప్రేమించినా తిరిగి ప్రేమిస్తారు.. నువ్ అన్ కండిషనల్‌గా ప్రేమించు’ అని చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు విని.. కనిపించిన ప్రతి అమ్మాయికి  ప్రపోజ్‌ చేసుకుంటూ వెళ్తాడు హీరో. కథతో కాస్త కొత్తదనం, చమత్కారం ఉన్నప్పటీ.. తెరపై అది వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. మదర్‌ సెంటిమెంట్‌కి కామెడీ టచ్‌ ఇచ్చి కథను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నరేశ్‌. కానీ అది బెడిసి కొట్టింది. చాలా చోట్ల లాజిక్‌ మిస్‌ అవుతుంది. అమ్మాయిలను ప్రేమించడానికి హీరో వైజాగ్‌ వెళ్లడం, తిరిగి హైదరాబాద్‌కు రావడం, అక్కడ రాజకీయనాయకుడితో గే లవ్‌ లాంటి సీన్స్‌ సిల్లీగా అనిపించినప్పటికీ మురళీ శర్మ కామెడీ మాత్రం నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోయింది.

ఫస్టాఫ్‌ అంతా కామెడీతో పర్వాలేదనిపించినా...సెకండాఫ్‌లో మాత్రం కొన్ని సీన్స్‌ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య పరిచయం. అది ప్రేమగా మారడం, 6 నెలలు ప్రేమించుకునేలా కండీషన్‌ పెట్టడం అంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావడం కోసం హీరో చేసింది సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ కూడా రోటీన్‌గా ఉండడం కాస్త ప్రతికూల అంశమే . ఇక సినిమాకు ఉన్నంతతో ప్రధాన బలం రధన్‌ సంగీతమనే చెప్పాలి. ఫస్టాఫ్‌లోని `గూగుల్‌ గూగుల్‌..`, `ఈ సింపుల్ చిన్నోడు’పాటతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. ఎస్‌. మణికందన్ సినమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌
విశ్వక్‌ సేన్‌,  నివేదా పేతురాజ్‌, మురళి శర్మ నటన 
సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌
కథ, కథనం
వర్కౌట్‌ కానీ లవ్‌ సీన్స్‌
సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్‌
రొటీన్‌ క్లైమాక్స్‌
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు