గందరగోళపు సినీ గ్యాంబ్లింగ్‌

13 Jun, 2021 06:15 IST|Sakshi

రివ్యూ టైమ్‌ @ పచ్చీస్‌

చిత్రం: ‘పచ్చీస్‌’
తారాగణం: రామ్స్, శ్వేతావర్మ
సంగీతం: స్మరణ్‌; కెమెరా: కార్తీక్‌ పర్మార్‌
నిర్మాతలు: కౌశిక్, రామసాయి
దర్శకత్వం: శ్రీకృష్ణ, రామ సాయి
ఓటీటీ: అమెజాన్‌

కరోనా సెకండ్‌ వేవ్, లాక్‌ డౌన్లతో థియేటర్లు మూసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు చూపంతా ఓటీటీల పైనే! వరుసగా బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు ఏదో ఒక ఓటీటీలో వస్తున్నాయి. ఖాళీ ఉంటే కాలం ఖర్చు చేయడానికి ఓకే కానీ, వీటిలో క్వాలిటీవి ఎన్ని వస్తున్నాయి? ఇలాంటి ఆలోచనలెన్నో రేకెత్తిస్తుంది – లేటెస్ట్‌ ఓటీటీ రిలీజ్‌ ‘పచ్చీస్‌’.

కథేమిటంటే..: కలవారి బిడ్డ అయినా ఈజీ మనీకి అలవాటు పడి, గ్యాంబ్లింగ్‌లో తిరిగే కుర్రాడు అభిరామ్‌ (రామ్స్‌). ఎలాగోలా డబ్బు సంపాదించాలనే కాంక్షతో అనేక అబద్ధాలతో, అడ్డదోవలు తొక్కుతుంటాడు. జీవితాన్ని జూదంగా నడిపేస్తుంటాడు. అదే సమయంలో రాజకీయ నాయకులైన గంగాధర్‌ (‘శుభలేఖ’ సుధాకర్‌), బసవరాజు (విశ్వేందర్‌ రెడ్డి) మధ్య ఆధిపత్యం కోసం పోరాటం సాగుతుంటుంది. బెట్టింగ్‌లో ఓడిపోయిన లక్షల కొద్దీ డబ్బు కోసం బసవరాజును ఆశ్రయిస్తాడీ కుర్రాడు. రాజకీయ నేతల మధ్య గొడవలో డబ్బు కొట్టేసి, దాంతో పబ్బం గడుపుకోవాలని అనుకుంటాడు. ఆ క్రమంలోనే కనిపించకుండా పోయిన అన్న కోసం వెతికే చెల్లెలు అవంతి (శ్వేతావర్మ) ఎదురవుతుంది. అక్కడ నుంచి సవాలక్ష మలుపులు, మరిన్ని పాత్రల మధ్య ఈ జూదం ఏమై, ఎవరి పచ్చీస్‌ (పాచికలు) పారి, చివరికి ఏమైందన్నది సుదీర్ఘమనిపించే 2 గంటల పైగా నిడివి సిన్మా.

ఎలా చేశారంటే..: నాగార్జున, విజయ్‌ దేవరకొండ, రామ్, రానా, అడివి శేషు – ఇలా తెలుగు సినీ తారలెందరికో ఫ్యాషన్‌ డిజైనరైన భీమవరం కుర్రాడు రామ్స్‌ ఇందులో జులాయి కుర్రాడిగా, మరో ఇద్దరు స్నేహితుల్ని వెంటేసుకొని కనిపిస్తారు. నటనలో ఈజ్‌ ఉన్నా, రాసిన పాత్రలో దమ్ము లేకపోవడం లోపమైంది. కొద్ది వారాలుగా కనిపించని అన్నయ్య కోసం వెతికే చెల్లెలి పాత్రలో, తానే ఓ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ లా ప్రవర్తిస్తుంటారు శ్వేతావర్మ. ఆ పాత్రకూ తీరూతెన్నూ కష్టపడి వెతుక్కోవాల్సి ఉంటుంది. సొంత పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం శ్రమించే పొలిటీషియన్‌గా ‘శుభలేఖ’ సుధాకర్‌ ఉన్నంతలో బాగా చేశారు. జయ్‌చంద్ర, క్యాసినో ఓనర్‌ > రవివర్మ సహా ఇంకా చాలామంది ఉన్నారు. అయితే, చిట్టి పొట్టి మాటల డైలాగులతో లేనిపోని ఉద్విగ్నత రేపాలనే రచనా లోపం భావోద్వేగ నటనకు తావు లేకుండా చేసిందనిపిస్తుంది.

ఎలా తీశారంటే..: ఓటీటీ ట్రెండ్‌కు తగ్గట్టే ఇదో క్రైమ్, సస్పెన్స్‌, యాక్షన్‌ చిత్రం అని ప్రకటించారు. కానీ, సస్పెన్స్‌ మాటెలా ఉన్నా... బోలెడంత గందరగోళం కథలో, కథనంలో మూటగట్టుకున్న చిత్రం ఇది. ఈ డార్క్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలో ఎప్పటికప్పుడు కొత్త పాత్రలొస్తూ పోతుంటాయి. దేనికీ ప్రాధాన్యం ఉండదు. ప్రతి పాత్రా ఏదో ఫిలాసఫీనో, గంభీరమైన విషయమో చెబుతున్నట్టు మాట్లాడుతుంది. పైగా, ఎక్కడో జరిగే ఏవో విషయాలూ జైలులో ఉన్నవాళ్ళతో సహా అన్ని పాత్రలకూ తెలిసిపోతుంటాయి. పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడానికే దాదాపు సగం సినిమా గడిచిపోతుంది.

అలాగే ప్రధాన పాత్రధారి ఒక చోట ఓ పోలీసాఫీసర్‌తో ‘‘ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అంటాడు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే ఫీలింగూ అదే. అభిరామ్‌ పాత్రను జులాయిలా చూపించారు. కాసేపేమో జర్నలిస్టు అని డైలాగుల్లో అనిపిస్తారు. ఇక, చివరలో వచ్చే పోలీసాఫీసర్‌ శంకర్‌ (దయానంద్‌ రెడ్డి) పాత్రలైతే, పోలీసు పని కాకుండా, నిందితుల వైపు నిలబడినట్టు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతున్నా... నోరెళ్ళబెట్టుకొని పోలీసులు చూస్తున్నట్టనిపిస్తుంది. సినిమా అంతా అభిరామ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో నడిచినట్టు అనిపించి, చివరకు వచ్చేసరికి వేరెవరికో ఇన్వెస్టిగేషన్‌ క్రెడిట్‌ ఇవ్వడం కూడా వీక్షకులు జీర్ణించుకోలేరు.

ఎక్కువగా నైట్‌ ఎఫెక్ట్‌లో డార్క్‌గా కనిపించే ఈ సినిమాలో కెమేరా వర్క్, ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ బాగుంటాయి. పాటలేమీ లేవన్న మాటే కానీ, ఆ లోటేమీ పెద్దగా ఫీల్‌ కాము. ఎడిటర్‌ తన కత్తెర పదును చూపితే, రచన – దర్శకత్వ లోపాలు కొన్నయినా కవరయ్యేవి. ‘‘ముగించలేనిది ఎప్పుడూ మొదలుపెట్టద్దు’’ అని ఇందులో ఓ పాత్ర అంటుంది. బహుశా, ఆ విషయం ఈ దర్శక, రచయితలకూ వర్తిస్తుంది. కథాకథనాన్ని సరిగ్గా మొదలుపెట్టలేకపోవడంతో పాటు ముగింపూ చేయలేదనిపిస్తుంది. కంటెంట్‌ లేని సీన్లు సవాలక్ష వచ్చిపోయే నేపథ్యంలో... పాత్రలతో పాటు ప్రేక్షకులనూ కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది.  

కొసమెరుపు: ఫాస్ట్‌ ఫార్వర్డ్‌లోనూ ముందుకెళ్ళని స్లో నేరేషన్‌ – ప... ప... ఛీ.. ఛీ...స్‌.
– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు