పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల

9 Nov, 2021 01:09 IST|Sakshi

2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్‌ సమి, నేపథ్య గాయకుడు సురేష్‌ వడ్కర్, సీనియర్‌ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు.

                                                                                 ఆలస్యంగా వచ్చినా ఆనందమే  – సురేష్‌ వాడ్కర్‌
‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్‌ వాడ్కర్‌ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్‌పురి భాషల్లో పాడారు సురేష్‌. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్‌ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్‌’లో ‘మేఘా రే.. మేఘా రే..’  వంటి పాటలు పాడారు వాడ్కర్‌.

ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్‌ జోహార్‌
‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్‌ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్‌ జోహర్‌. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘కల్‌ హో నా హో’, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్‌ జోహార్‌. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్‌’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు.

నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్‌
‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్‌)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్‌ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్‌. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్‌’, ‘షూట్‌ అవుట్‌ అట్‌ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. 

ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్‌ సమీ
‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్‌ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్‌ తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్‌ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు.  

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్‌లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్‌’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర  చిత్రాల్లో నటించారు.  
     

ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను
‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్‌. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్‌ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్‌ హౌసెస్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్‌సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్‌’, ‘తనువెడ్స్‌ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్‌ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్‌

 

మరిన్ని వార్తలు