Pakistan Model Sauleha: సిక్కు మతస్థుల ఆగ్రహం.. పాక్‌ మోడల్‌ క్షమాపణలు

30 Nov, 2021 14:26 IST|Sakshi

Pakistan Model Apologises After Her Photos Went Viral: సిక్కు మతస్థులు తమ మతాన్ని, సంస్కృతిని, ఆచార్యవ్యవహారాలను ఎంతో గౌరవిస్తారు. ఆలయాల్లో వారి ఆచారాలు పాటించకుండా, అగౌర్వపరిస్తే అస్సలు ఊరుకోరు. ఎదుటివారు ఎలాంటివారైనా తమదైన స్టైల్‌లో విరుచుకుపడతారు. ఇటీవల ఒక పాకిస‍్థాన్‌ మోడల్‌పై ఆ దేశ సిక్కు మతస్థులు గరంగరంగా ఉండడంతో క్షమాపణలు చెప్పింది. పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌లో మోడల్‌ సౌలేహ ఒట్టి తలతో (హెడ్‌ కవర్‌ లేకుండా) ఉన్న ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకుంది. అది చూసిన మతస్థులు తమ మనోభావాలు దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి క్షమాపణలు చెబుతూ అదే ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది ఆ మోడల్‌. 

'ఇటీవల నేను ఇన్‌స్టాలో ఒక ఫొటోను పోస్ట్‌ చేశాను. నేను చరిత్ర, సిక‍్కు సమాజం గురించి తెలుకోవడానికి కర్తార్‌పూర్‌కి వెళ్లాను. అంతేగానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారి సంస్కృతిని అగౌరపరిచానని భావిస్తే నన్ను క్షమించండి. అక్కడ ఫొటోలు తీసే ప్రజలను చూశాను. నేను సిక్కు మతానికి సంబంధించిన ఫొటోలు కూడా తీసుకున్నాను. అక్కడ అలా చేయాల్సింది కాదు. నేను సిక్కు సంస్కృతిని చాలా గౌరవిస్తాను. ఈ ఫొటోలు నేను అక్కడికి వెళ్లనట్లుగా జ్ఞాపకంలో భాగం మాత్రమే. అంతకు మించి ఏమి లేదు. భవిష్యత్తులో వీటి గురించి మరింత అవగాహనతో ఉంటాను. ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాను. అలాగే నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అది అందరికీ తెలిసేలా చేయండి.' అని మోడల్‌ సౌలేహ సంజాయిషీ ఇచ్చుకుంది. 

A post shared by Sauleha صالحہ امتیاز 🇵🇰 (@swalaaa_lala)

అయితే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా ఆలయం లోపల సోమవారం మోడల్‌ తల చుట్టూ ఎలాంటి వస్త్రం లేకుండా ఫోజులిచ్చిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో శిరోమణి అకాలీదళ్‌ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్‌ సిర్సా కూడా సౌలేహను విమర్శించారు. 'శ్రీ గురునానక్‌ దేవ్‌ జీ పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన, చర్య పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఆమె పాకిస్థాన్‌లోని తన మత స్థలంలో కూడా ఇలాగే చేస్తుందా ? అలా చేయడానికి ధైర్యం ఉందా ? కర్తార్‌పూర్‌ సాహిబ్‌ పిక్నిక్‌ స్పాట్‌ అనుకుంటున్న పాకిస్థాన్‌ ప్రజలు ధోరణిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది.' అని మంజీందర్‌ సింగ్‌ సిర్సా ట్వీట్ చేశారు. అయితే పాకిస్థాన్‌ పంజాబ్‌లోని కర్తార్‌పూర్  సాహిబ్‌ గురుద్వారా సిక్కులకు పవిత్రస్థలం.  

మరిన్ని వార్తలు