ఇమ్రాన్‌ లవ్‌ స్టోరీ: ఆ బాలీవుడ్‌ హీరోయిన్స్‌తో ప్రేమాయణం, జాతకాలూ కూడా చూశారట..!

12 Sep, 2021 17:18 IST|Sakshi

Pakistan PM Imran Khan Love Story: సినిమా, క్రికెట్‌.. ఈ దేశంలో వినోదాన్ని పంచే రంగాలు. వదంతులుగానో.. వర్చువల్‌గానో.. వాస్తవంగానో.. వీరాభిమానుల భ్రాంతిగానో.. ఈ రెండు రంగాలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమ కథలు వినిపిస్తే.. వాళ్లు జంటగా కనిపిస్తే.. అంతకు మించిన సినిమా.. ఉత్కంఠ గొలిపే మ్యాచ్‌ ఏం ఉంటుంది? అలాంటి ఊసులు.. బాసలు.. కబుర్లను మోసుకొస్తోంది ఈ మొహబ్బతే! వీటిల్లో విషాదాంతాలుండొచ్చు.. హ్యాపీ ఎండింగ్‌లూ కనిపించొచ్చు! ఆ వరుసలో ఈ వారం శీర్షిక ముఖ్య భూమికలు  బాలీవుడ్‌ బోల్డ్‌ యాక్ట్రెస్ట్‌ జీనత్‌ అమన్‌.. పాకిస్తానీ ఏస్‌ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇంకా.. చదవండి

ఇది 1970,80ల ముచ్చట..
ఇటు బాలీవుడ్‌లో జీనత్‌.. అటు పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఇమ్రాన్‌ హవా నడుస్తున్న కాలం. ఏదో మ్యాచ్‌ ఆడడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ అండ్‌ టీమ్‌ ఇండియా వచ్చింది. మ్యాచ్‌ అయిపోయింది. సరదాగా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి కొందరు ప్రముఖులు.. సెలబ్రిటీలూ హాజరయ్యారు. వాళ్లలో జీనత్‌ అమన్‌ కూడా ఉంది. ఆ అందాన్ని చూసి అప్రతిభుడయ్యాడు ఇమ్రాన్‌. తెర మీద కన్నా అద్భుతంగా కనిపించింది. ఇమ్రాన్‌ హ్యాండ్‌సమ్‌నెస్‌కూ అంతే ఫిదా అయిపోయింది జీనత్‌. అతని కళ్లలోని సమ్మోహనం ఇంటికి వెళ్లినా ఆమెను వెంటాడింది. ఆమె నవ్వులోని స్వచ్ఛత అతన్నీ నిద్రపోనివ్వలేదు. స్నేహం పెంచుకున్నారు. ఇద్దరి షెడ్యూల్స్‌ ఏ మాత్రం మ్యాచ్‌ అయినా విదేశాలే వాళ్ల హ్యాంగవుట్‌ విలాసాలు. పత్రికల్లో ఆ ఫొటోలు.. అనుగుణంగా అల్లిన వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇద్దరి అభిమానులనూ ఎంతలా అలరింపచేశాయంటే ఆ ఇద్దరి ప్రణయంతో ఇండియా, పాకిస్తాన్‌ దగ్గరైపోయినట్టు.. వాళ్లు పరిణయమాడితే ఆ రెండు దేశాలూ కలసిపోతాయన్నట్టూ కలలు కనేంతగా. కానీ హఠాత్తుగా జీనత్‌ అమన్‌ మజహర్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఇమ్రాన్‌ జీవితంలోకీ ఇంకో స్త్రీ వచ్చింది. ఈ బ్రేకప్‌ గురించి ఎక్కడా ఏ వార్తా లేదు. ఆ ఇద్దరూ కూడా పెదవి విప్పలేదు. ఆ మాటకొస్తే ప్రేమలో పడ్డ విషయాన్నే అంగీకరించలేదు. 

కానీ.. ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ ఓ పుస్తకంలో ఇమ్రాన్, జీనత్‌ అనుబంధం గురించి రాసింది. అంటే అతని జీవితంలో జీనత్‌ ఉనికిని స్పష్టం చేసిందన్నమాట. 
అదీగాక.. కొన్నేళ్ల కిందట  ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు జీనత్‌ లాహోర్‌ (పాకిస్తాన్‌)కు వెళ్లింది. అక్కడ జరిగిన ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఒక జర్నలిస్ట్‌ అడిగాడు ఇమ్రాన్‌తో ఆమెకున్న అనుబంధం గురించి! దానికి ఆమె ‘మేం పెద్దవాళ్లమైపోయాం. మా పిల్లలు పెరిగారు. పాత సంగతులను చర్చకు పెట్టడం ఇప్పుడు అవసరమా? గతాన్ని గతంలాగే ఉండనివ్వండి’ అందట. 

ఈ మధ్య జీనత్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడట నాటి క్రికెటర్‌.. నేటి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. ఆయన బాలీవుడ్‌ మేటి నటి రేఖతో కూడా ప్రేమలో పడ్డాడని నిజం లాంటి వదంతి ప్రచారంలో ఉంది. దీనికీ నాటి సినిమా పత్రికలే సాక్ష్యం. 

ఆ కహానీ ఏంటంటే..  
రేఖ అంటే ఇమ్రాన్‌ పంచప్రాణాలు పెట్టేవాడట. మ్యాచ్‌ల కోసం అతనెప్పుడు ఇండియా వచ్చినా పార్టీల్లో.. సన్నిహితుల గెట్‌ టుగెదర్‌ అకేషన్స్‌లో ఆ జంట ఫొటోలు నాటి మీడియాలో ప్రధానాకర్షణగా నిలిచేవి. వాళ్ల ప్రేమ వ్యవహారం కథనాలుగా సాగేది. ఒక పత్రికలో ప్రచురితమైన వ్యాసం ప్రకారం.. రేఖ వాళ్లమ్మ కూడా ఆ ప్రేమకు సమ్మతం తెలిపిందట. అంతేకాదు ఓ జ్యోతిష్యుడిని కలసి వాళ్ల జాతకాలూ చూపించిందట ఆ ఇద్దరి వైవాహిక బంధం ఎలా ఉండనుందని! రేఖతో క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేయడానికి చాలా ఆసక్తి చూపేవాడట ఇమ్రాన్‌. ఆ జంట తరచుగా బీచ్‌లో, నైట్‌ క్లబ్‌లో కనిపించేదట. ‘వాళ్లిద్దరూ ఒకర్నొకరు చాలా ఇష్టపడ్డారు’ అని ఆ ఇద్దరి సన్నిహితుల మాట కూడా. ఒకానొక సమయంలో ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలూ వచ్చాయట. దానిమీదే స్పందిస్తూ కావచ్చు ‘ఆ నటి సాంగత్యాన్ని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ రిలేషన్‌ను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని అనుకోలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదు’ అని ఇమ్రాన్‌ చెప్పిన మాటకూ ఆ వ్యాసం చోటిచ్చింది. అలా ఆయన జీవితంలో రేఖ అధ్యాయమూ ముగిసింది. షబానా ఆజ్మీ, మున్‌మున్‌ సేన్‌లతోనూ ఇమ్రాన్‌ ప్రేమ ప్రయాణం సాగిందని రూమర్స్‌.  
- ఎస్సార్‌ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు