Mahira Khan-Salim Karim Marriage: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్‌, ప్రియుడు ఎమోషనల్‌.. వీడియో వైరల్‌

2 Oct, 2023 10:38 IST|Sakshi

పాకిస్తాన్‌ హీరోయిన్‌ మహీరా ఖాన్‌.. ఇండియాలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. రేయిస్‌ మూవీలో షారుక్‌ ఖాన్‌తో జోడీ కట్టిన ఈ బ్యూటీ తర్వాత మరే భారతీయ చిత్రంలోనూ నటించలేదు. కానీ ఈ సినిమాతో బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరోయిన్‌ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త సలీమ్‌ కరీమ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. మహీరా మేనేజర్‌ అనుషయ్‌ తల్హా ఖాన్‌ ఈ పెళ్లి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మహీరా తనవైపు నడుచుకుంటూ వస్తుండటంతో వరుడు ఎమోషనల్‌ అయ్యాడు. తనను దగ్గరకు తీసుకుని కంటతడి పెట్టుకున్నాడు. ఆమెకు ప్రేమగా ముద్దుపెట్టి తనను హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. ఇక పెళ్లికూతురి గెటప్‌లో మహీరా మెరిసిపోయింది. పేస్టల్‌ లెహంగా ధరించిన వధువు దానికి మ్యాచింగ్‌గా వజ్రాభరణాలు ధరించింది. సలీమ్‌ బ్లాక్‌ షేర్వాణీ వేసుకోగా తలకు నీలిరంగు తలపాగా చుట్టుకున్నాడు. పాకిస్తాన్‌లోని ముర్రేలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

ఈ కొత్త జంటకు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మహీరా, సలీమ్‌ కొన్నేళ్లుగా డేటింగ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని గతేడాదే ఆమె అధికారికంగా వెల్లడించింది. ఇంత కాలానికి తమ ప్రేమను ముందుకు తీసుకువెళ్లి పెళ్లితో ఒక్కటయ్యారు.

చదవండి: ప్రతివారం ఆ పని చేయకపోతే మనసు ఊరుకోదంటున్న చంద్రముఖి 2 నటి

మరిన్ని వార్తలు