చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్‌

15 Jun, 2022 13:00 IST|Sakshi

హిట్‌,ప్లాప్‌లతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథనలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నాడు హీరో గోపీచంద్‌. ‘తొలివలపు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై..తర్వాత విలన్‌గా పలు సినిమాల్లో నటించి, మళ్లీ హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచోస్టార్‌ ‘పక్కా కమర్షియల్‌’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. రాశీఖన్నా హీరోయిన్‌.

విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గోపీచంద్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూ తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. జయం చిత్రానికి గాను తాను తీసుకున్న రెమ్యునరేషన్‌ కేవలం రూ.11 వేలు మాత్రమేనని చెప్పాడు. డైరెక్టర్ తేజకు 11 లక్కీ నంబరు అని.. అందుకే తనకు రూ.11 వేలు ఇచ్చారని అన్నాడు. ఆ డబ్బులు తీసుకుని.. దీని పక్కన ఇంకో సున్నా ఉండోచ్చు కదా అని అనుకున్నానని సరదాగా చెప్పాడు.

ఇక ఇప్పటివరకు నటించిన చిత్రాలలో దేనికి ఎక్కువగా రెమ్యునరేషన్‌ తీసుకున్నావని అడగ్గా.. ‘పక్క కమర్షియల్‌’ చిత్రానికే అత్యధిక పారితోషికం అందుకున్నానని బదులిచ్చాడు. ఎవరికైనా అప్పు ఇచ్చారా అని అడిగితే.. చాలా మందికి ఇచ్చానని, కొంతమంది తిరిగి ఇస్తే.. మరికొంత మంది ఇవ్వలేదని చెప్పాడు. వారి పరిస్థితి చూసి తాను కూడా డబ్బులు అడగలేదన్నారు. ఇలాంటి విషయాలలో తాను అంత కమర్షియల్‌ కాదని గోపీచంద్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు