బీ-టౌన్లో కరోనా కష్టాలు.. టెన్షన్‌లో స్టార్‌ హీరోలు

7 Apr, 2021 08:19 IST|Sakshi

గత ఏడాది మార్చిలో కరోనా విలన్‌లా ఎంట్రీ ఇచ్చి థియేటర్స్‌పై విరుచుకుపడింది. ఫలితంగా లాక్‌డౌన్‌ వచ్చి థియేటర్స్‌ అన్నీ మూతపడిపోయాయి. వెండితెర కళ తప్పింది. ఓ ఆరు నెలల తర్వాత కరోనా కొంత శాంతించింది. ఇక థియేటర్స్‌లో ప్రేక్షకుల చప్పట్లు వినిపిస్తాయని అనుకున్నారు. థియేటర్లు తెరుచుకున్నాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా రెట్టింపు బలంతో వచ్చింది. అంతే... బాలీవుడ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లను మూసేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

దాంతో, సినిమా విడుదలకు దారేది? అంటూ బాలీవుడ్‌ ప్రముఖులు తలలు పట్టుకు కూర్చున్నారు. కొందరు తమ సినిమా విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతానికి ఐదు సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. ఒక పక్క బాలీవుడ్‌ స్టార్స్‌కు కరోనా బారినపడుతున్నారు. థియేటర్ల మూసివేత బాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సైఫ్‌ అలీఖాన్ ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’, రానా ‘హాథీ మేరే సాథీ’, అమితాబ్‌ బచ్చన్‌ ‘చెహ్రే’, తాజాగా అక్షయ్‌కుమార్‌ ‘సూర్యవంశి’ సినిమాల విడుదలు వాయిదా పడ్డాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని సినిమాలు వాయిదా పడనున్నాయో అని బీ టౌన్లో ఆల్రెడీ చర్చ మొదలైంది. 

ఓటీటీ బాటలో...
గత ఏడాది విడుదల కావాల్సిన సినిమాలు కొన్ని వాయిదా పడుతూ ఈ ఏడాది రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి. అయితే, ఈ సినిమాలన్నీ థియేటర్స్‌లోనే వస్తాయన్న గ్యారంటీ లేదు. గత ఏడాది కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద పెద్ద సినిమాలు కూడా స్ట్రీమింగ్‌ అయ్యాయి. ఈ ఏడాది కూడా దాదాపు 14 సినిమాలు తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. గత ఏడాది హాట్‌స్టార్‌ ఒకేసారి 8 భారీ హిందీ సినిమాల స్ట్రీమింగ్‌ రైట్స్‌ను దక్కించుకుని అందరికీ షాక్‌ ఇచ్చింది. 

తాజా పరిణామాల దృష్ట్యా మళ్లీ సినిమాలన్నీ ఓటీటీ బాట పడతాయా అనే  టెన్షన్‌ స్టార్‌ హీరోల అభిమానుల్లోను, ఎగ్జిబిటర్లలోనూ మొదలైంది. అందుకు ఓ ఉదాహరణ...  సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ఓ బడా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. కానీ ముంబయ్‌ థియేటర్స్‌ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌ విన్నపం మేరకు ‘రాధే’ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని సల్మాన్‌  ప్రకటించారు. మే 13న చిత్రాన్ని విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. అయితే కరోనా విజృంభణకు ముందు తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు ‘రాధే’ థియేటర్‌కి వస్తాడా? ఓటీటీలో దర్శనమిస్తాడా? అనేది హాట్‌ టాపిక్‌. 

అలాగే ’సూర్యవంశీ’ సినిమాను థియేటర్లలో చూస్తే బాగుండేలా తీశామని హీరో అక్షయ్‌కుమార్, దర్శకుడు రోహిత్‌ శెట్టి చెబుతూ వచ్చారు. ఈ నెల 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి... ఇదే బాటలోకి మిగతా సినిమాలు కూడా వస్తాయా? లేక ఆలస్యమైనా సరే థియేటర్స్‌లో విడుదల చేసేందుకే మొగ్గు చూపుతాయా అనేది చూడాలి. ఇంకో విషయం ఏంటంటే... ఇటీవల ప్యాన్‌  ఇండియా సినిమాలు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. బాలీవుడ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది కాబట్టి, ప్యాన్‌ ఇండియా చిత్రాల్లో హిందీ వెర్షన్‌  విడుదలను ఆపుతారా అనే చర్చ కూడా జరుగుతోంది.  

ఇప్పుడు ప్యాన్‌  ఇండియా  సినిమాల హవా నడుస్తోంది. మార్కెట్‌ పరంగా హిందీలో రిలీజ్‌ కావడం కూడా ముఖ్యమే. ‘బాహుబలి’ రెండు భాగాల వసూళ్ళు రూ. 1600 కోట్లకు పైనే అని ఓ లెక్క. ఈ వసూళ్లలో హిందీ మార్కెట్‌ది కూడా ప్రధాన వాటాయే. అంతెందుకు... బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ టాప్‌ 10 మూవీస్‌లో ‘బాహుబలి’ ఒకటి. అలాంటిది ఇప్పుడు సరైన హిందీ మార్కెట్‌ లేకుండా రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’ వంటి ప్యాన్‌ ఇండియా సినిమాల కలెక్షన్స్‌ను భారీ స్థాయిలో ఊహించుకోగలమా?.

హిందీలో రిలీజ్‌ చేయకుండా ఇతర భాషల్లో రిలీజ్‌ చేయడానికీ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. కర్ణాటక థియేటర్స్‌లో సీటింగ్‌ ఆక్యుపెన్సీ యాభై శాతమే. తమిళనాడులో కూడా పరిస్థితులు అంత బాగాలేవు. లాక్‌డౌన్‌  లిఫ్ట్‌ చేసిన తర్వాత విజయ్‌ ‘మాస్టర్‌’, కార్తీ ‘సుల్తాన్‌ ’ మినహా, ఇప్పటివరకు అక్కడ మరి ఏ ఇతర స్టార్‌ మూవీలూ రిలీజవలేదు. ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరి.. కేవలం తెలుగు భాషలోనే సినిమాలు విడుదలైతే భారీ వసూళ్లు ఉండవనే భయం నిర్మాతల్లో ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు