ఆ టెక్నిక్‌తో ఆఫీసుల్లోకి ఈజీగా వెళ్లేవాడిని : పంకజ్‌ త్రిపాఠి

31 Jan, 2021 15:55 IST|Sakshi

పంకజ్‌ త్రిపాఠి అంటే అందరికీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌’ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత అతను ‘మసాన్‌’, ‘స్త్రీ’, ‘న్యూటన్‌’ తదితర సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అతను నటించిన వెబ్‌సిరీస్‌ ‘క్రిమినల్‌ జస్టిస్‌’ మంచి ప్రశంసలు పొందుతోంది. ఇప్పుడు క్షణం తీరిక లేని ఆర్టిస్టే అయినా ఒకప్పుడు అంటే 2000 సంవత్సరంలో అవకాశాల కోసం ఎక్కే గడప దిగే గడపగా అతను జీవించాడు. భార్యను స్కూల్‌ టీచర్‌గా చేర్చి ఆ వచ్చే జీతంతో బతుకుతూ అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు.

అయితే ఆఫీసుల్లోకి అంత సులభంగా ఎవర్నీ రానివ్వరు. దానికి త్రిపాఠి ఒక టెక్నిక్‌ పాటించేవాడు. సినిమా తీయబోతున్న ప్రతి ఆఫీసుకు తన ఫోటోలతో వెళ్లి ‘ఈశ్వర్‌ గారు పంపారండీ నన్ను’ అని రిసెప్షన్‌లో చెప్పేవాడు. ‘ఈశ్వర్‌ గారు పంపారట’ అనేసరికి ఆ ఈశ్వర్‌ ఎవరో ప్రముఖుడనుకొని లోపలికి రానిచ్చేవారు. ఫొటోలు తీసుకుని మాట్లాడి ఆఖరున ‘ఇంతకీ ఏ ఈశ్వర్‌ గారండీ’ అని అడిగేవారు. అప్పుడు పంకజ్‌ ఆకాశం వైపు చూపించి ’ఆ ఈశ్వర్‌ అండీ. ఆయనే కదా భూమ్మీదకు మనందరినీ పంపింది’ అనంటే అందరూ నవ్వేసేవారట. ఆ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉండటం వల్లే ఆయన అంత మంచి నటుడయ్యాడు. 

మరిన్ని వార్తలు