ఆఫర్లు రాకపోయినా బాధపడను: నటుడు

3 Nov, 2020 20:10 IST|Sakshi

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న నటుడు

‘‘నిజానికి చిన్నపుడు నేను చాలా డ్యాన్స్‌ చేసేవాడిని. ఐటం సాంగ్స్‌కి కూడా నర్తించేవాడిని. అందరూ నా డాన్స్‌ను మెచ్చుకునేవాళ్లు. ఊళ్లో నాటకాలు వేసే సమయంలో ఎక్కువగా ఆడ వేషాలు వేసేవాడిని. ఇదంతా చూసిన మా ఊరి పెద్దాయన ఒకరు.. ‘‘ఇదిగో ఈ అబ్బాయి ముంబైకి వెళ్తే.. టాప్‌ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేస్తాడు’’అని తరచూ అంటూ ఉండేవారు’’అంటూ బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాను కచ్చితంగా హిందీ చిత్రసీమలో ప్రవేశిస్తానని అందరూ అనుకునే వారని, కానీ తాను మాత్రం ఎన్నడూ నటుడిని అవుతానని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.(చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్‌!)

బరేలీ కీ బర్పీ, న్యూటన్‌, గుంజన్‌ సక్సేనా వంటి ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు, సాక్రెడ్‌ గేమ్స్‌, మీర్జాపూర్‌ వంటి వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందాడు పంకజ్‌ త్రిపాఠి. నటి నేహా దుఫియా నిర్వహిస్తున్న ‘‘నో ఫిల్టర్‌ నేహా’’ చాట్‌ షోలో పాల్గొన్న అతడు తమ మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘మా గ్రామంలో నాటకాలు వేసేవాళ్లం. పదో తరగతి చదువుతున్న సమయంలో తొలిసారి అమ్మాయి వేషం వేశాను. అప్పటి వరకు ఆ పాత్ర పోషించిన అబ్బాయి ఒకరు సిటీకి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో నాటకం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ముందుకొచ్చి.. ఆ వేషం వేస్తా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు.

ముఖ్యంగా మా డైరెక్టర్‌ రాఘవ్‌ చాచా అయితే, నాన్న దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకున్న తర్వాతే వేషం ఇస్తా అన్నారు. కోపంతో లాఠీ పట్టుకుని నా వీపు విమానం మోగిస్తారేమో అని భయపడ్డా. కానీ నాన్న అభ్యంతరం చెప్పలేదు. నాకు నచ్చిన పనిచేసే స్వేచ్చ ఉందన్నారు. తర్వాత నేను ఎన్నో నాటకాల్లో భాగస్వామ్యమయ్యాను. కానీ ముంబైకి వస్తానని, బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడతానని ఎన్నడూ అనుకోలేదు. అప్పుడు సరదా కోసం చేసి నటన, ఇప్పుడు జీవితంగా మారింది’’అని పంకజ్‌ పేర్కొన్నాడు. ఇప్పుడు తనకున్న ఆర్థిక పరిస్థితితో సంతృప్తికరంగా ఉన్నానని, ఇకపై ఎండార్స్‌మెంట్లు, సినిమా ఆఫర్లు రాకపోయినా పెద్దగా బాధపడనని చెప్పుకొచ్చాడు. ఇక మంచు విష్ణు దూసుకెళ్తా సినిమాలో విలన్‌గా పంకజ్‌ త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు