Parampara 2 Review Telugu: ప్రాణం కాపాడినవాన్నే అణచివేస్తే.. 'పరంపర 2' సిరీస్​ రివ్యూ

21 Jul, 2022 18:50 IST|Sakshi

టైటిల్​: 'పరంపర 2' వెబ్​ సిరీస్
నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్​ కుమార్, ఇషాన్​, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్​బాస్ దివి తదితరులు
కథ: హరి ఏలేటి
మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్​ ఎల్​
సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: నరేష్​ కుమరన్​
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్​ దేవినేని
దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల
విడుదల తేది: జులై 21, 2022
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్​స్టార్, ఎపిసోడ్స్​ 5

గతేడాది విడుదలై సినీ లవర్స్​ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్​లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్​ 24, 2021న డిస్నీ ప్లస్​ హాట్​స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్​లోని రివేంజ్​, ఎమోషన్స్​ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్​ను తాజాగా విడుదల చేశారు. యంగ్​ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్​ కుమార్​ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్​ సిరీస్​ జులై 21న విడుదలైంది. పొలిటికల్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సిరీస్​ సెకండ్​ సీజన్​ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్​) పెళ్లి  సురేష్ (ఇషాన్​)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్​ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్​ కుమార్​) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్​ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్​పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే. 

విశ్లేషణ:
పరంపర సీజన్​ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్​ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్​ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్​తో పోల్చి చూస్తే సిరీస్​ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్​లోలాగా ఎలాంటి ల్యాగ్​ లేకుండా ఫాస్ట్​గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్​ప్లే, నేరేషన్​ రేసీగా ఉన్న తొలి సీజన్​ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్​గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్​ఫ్యూజన్​ ఉంటుంది. అయితే మొదటి సీజన్​లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్​ నిడివి విషయంలో డైరెక్టర్స్​, రైటర్స్​ విజయం సాధించారనే చెప్పవచ్చు. 

ఫస్ట్​ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్​ గురించే ఇచ్చే లీడ్​ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్​తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్​ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్​ అండ్ మౌస్ గేమ్​ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్​గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్​ కథలా ఫీల్​ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్​ రాసిన డైలాగ్స్​ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్​ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్​, జెన్నీ మిస్సింగ్​లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్​లో చెప్పొచ్చేమో. 

ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ.. 

ఎవరెలా చేశారంటే?
నవీన్​ చంద్ర కెరీర్​కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్​, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్​ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్​ కుమార్​లు తమ యాక్టింగ్​తో అదరగొట్టారు. సింపుల్​గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్​ఫుల్​ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్​ అలరిస్తుంది. అలాగే శరత్​ కుమార్​ కూడా స్టైలిష్​ లుక్​లో విలన్​గా మెప్పించారు. 

ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్​, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్​లో రవి వర్మ, బిగ్​బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్​గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్​గా చెప్పాలంటే స్టోరీ రొటీన్​గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్​ మూమెంట్స్​, ఫ్యామిలీ ఎమోషన్స్​, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది. 

-సంజు (సాక్షి వెబ్​డెస్క్​)

మరిన్ని వార్తలు