Parampara Review: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'..

31 Dec, 2021 14:56 IST|Sakshi

టైటిల్‌: పరంపర
కథ: హరి యేలేటి
దర్శకత‍్వం: కృష్ణ విజయ్‌, విశ్వనాథ్‌ అరిగెల, హరి యేలేటి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని 
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌
నేపథ్య సంగీతం: నరేష్‌ కుమారన్‌
ఓటీటీ: డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
విడుదల: 24 డిసెంబర్ 2021

బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ 'ఆర్కా మీడియా' వెబ్‌ సిరీస్‌ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కృష్ణ విజయ్‌, విశ్వనాథ్‌ అరిగెల, హరి యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెబ్‌ సిరీస్‌ పరంపర. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్కా మీడియా ఒక వెబ్‌ సిరీస్‌ తీస్తుందనే వార్తలు వినిపించడంతో 'పరంపర'పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. మురళి మోహన్‌, జగపతి బాబు, శరత్‌ బాబు వంటి, ఆమని వంటి సీనియర్‌ నటీనటుమణులతో తెరకెక్కిన 'పరంపర' మొదటి నుంచే మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. అలాగే హాట్‌స్టార్‌ ఒరిజినల్స్ మొదటిసారిగా చేసిన తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇది కావడం విశేషం. యాక్షన్‌, పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్ ప్రేక్షకులకు ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:
రాజకీయం, పవర్‌, మోసం, కుటుంబం విలువలు వంటి అంశాలతో రూపొందించిన వెబ్‌ సిరీస్‌ పరంపర. విశాఖ జిల్లాకు చెందిన వీర నాయుడు (మురళి మోహన్‌) ప్రజల మనిషి. రాజకీయాల్లో తనదైన శైలిలీ పట్టు సాధిస్తూ ప్రజలకు అండగా నిలుస్తాడు. వీర నాయుడికి మోహన రావు (జగపతి బాబు), నాగేంద్ర నాయుడు (శరత్‌ కుమార్‌) ఇద్దరు కుమారులు. రాజకీయాలు, ప్రజలను ఆదుకోవడం వంటి పనులను పెద్ద కుమారుడైన మోహన రావుకు కట్టబెడుతూ ప్రాముఖ్యతనిస్తాడు వీర నాయుడు. ఇది చూసిన నాగేంద్ర నాయుడుకు ఈర్శ్య, ద్వేషం కలుగుతాయి. దీంతో ఎలాగైన తాను కింగ్‌మేకర్‌గా అవ్వాలనుకుంటున్న నాగేంద్ర నాయుడికి తన తండ్రి మరణం మంచి అవకాశంగా మారుతుంది. ఈ ఒక్క సంఘటనతో రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్ని నాగేంద్ర నాయుడి చేతుల్లోకి వెళతాయి. అక్కడినుంచి నాగేంద్ర నాయుడి ఆధిపత్యం కొనసాగుతోంది. 

సెంటిమెంట్‌తో తన తండ్రిని పక్కన పెట్టి బాబాయ్‌ అధికారం చేజిక్కించుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు గోపి (నవీన్‌ చంద్ర). ఎలాగైన తిరిగి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడతాడు. ఇందుకోసం నాగేంద్ర నాయుడితో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు గోపి. ఈ యుద్ధాన్ని కాలేజీ ప్రెసిండెట్‌ ఎన్నికల్లో నాగేంద్ర నాయుడు కుమారుడు సురేష్‌ (ఇషాన్‌)తో పోటీకి దిగుతాడు. అక్కడినుంచి నాగేంద్ర నాయుడితే గోపి యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే ఈ యుద్ధంలో గోపి గెలిచాడా ? అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడా ? అతనికి ఎదురైన పాత్రలు తనపై ఎలాంటి ప్రభావం చూపాయి ? అనేదే కథ. 

విశ్లేషణ: 

కథ అంత కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆధిపత్య పోరు, కుటుంబం కన్నా రాజకీయం ముఖ్యమనిపించే కథలు ఇది వరకు చాలానే చూశాం. అయితే కథను ఆవిష్కరించిన విధానంలో మాత్రం దర్శకులు విజయం సాధించారు. నాగేంద్ర నాయుడిపై అటాక్‌తో 'ప్రారంభం' అనే ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది 'పరంపర' వెబ్‌ సిరీస్‌. ఈ యాక్షన్‌ సీన్‌తోనే పాత్రల పరిచయం చేస్తూ గోపి మోటివ్‌ను చూపించారు దర్శకులు.  పొలిటికల్‌ డ్రామా, అధికారానికి ఉన్న శక్తిని చూపిస్తూనే కుటుంబం విలువలు, ఎమోషన్‌ను బాగా చూపించారు. రాజకీయం, అధికారమే తప్ప దేన్ని పట్టించుకోని అత్యంత కఠినమైన పాత్ర నాగేంద్ర నాయుడిది. అలాంటి పాత్ర కూడా ఎమోషనల్‌ అయి వెంటనే ఈర్శ్య కలగడం వంటి సీన్లతో అహంకారం ముందు ప్రేమ ఎలా నిలవలేదో చూపించి ఆకట్టున్నారు.  

హరి యేలేటి కథ అందించిన ఈ వెబ్‌ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉ‍న్నాయి. మొదటి  కృష్ణ విజయ్‌. ఎల్‌ డైరెక్ట్‌ చేయగా మిగతా ఎపిసోడ్‌లన్నింటిని విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి డైరెక్ట్‌ చేశారు. అయితే వెబ్‌ సిరీస్‌ నిడివి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్‌లు కలిపి సుమారు ఐదున్నర గంటలకుపైగా ఉంటుంది. కాకపోతే వెబ్ సిరీస్‌ ప్రారంభం నుంచి ఎంగేజింగ్‌గా తీశారు. అస్సలు బోర్‌ కొట్టదు. నాగేంద్ర నాయుడు, గోపి మధ్య పోటీ, నాగేంద్ర నాయడిపై గెలవాలని గోపి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. మోహన రావును నాగేంద్ర నాయుడు ఎంత తొక్కిపెట్టిన తిరగబడక పోవడం, మోహన రావుపై నాగేంద్ర నాయుడి ఈర్శ్యకు గల కారణాలను బానే ప్రజెంట్‌ చేశారు. 

చివరి రెండు ఎపిసోడ్‌లు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ప్రేక్షకులు నిరాశ పడతారు.  అయితే క్లైమాక్స్‌ మాత్రం క్లైమాక్స్‌లా ఉండదు. ఇంకా వెబ్‌ సిరీస్‌ కొనసాగుతుందేమో అనే ఫీలింగ్‌ను క్రియేట్‌ చేస్తుంది. వెబ్‌ సిరీస్‌కు ఇదే ఆరంభం మాత్రమే అనే హింట్ ఇచ్చేందుకే దర్శకులు  క్రైమాక్స్‌ అలా ప్లాన్‌ చేశారేమో అని తెలుస్తోంది. క్లైమాక్స్‌తో అసలు కథ ఇంకా మిగిలే ఉందని, ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌ కూడా రానుందని అర్థమైపోతుంది. అక్కడక్కడ కొన్ని అడల్ట్‌ కంటెంట్‌ సీన్లు ఉంటాయి. ఇవి కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. సిరీస్‌లో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. 

ఎవరెలా చేశారంటే:

నలుగురికి సహాయపడే పాత్రలో మురళి మోహన్‌, జగపతి బాబు చక్కగా ఒదిగిపోయారు. సాధారణంగా కుటుంబంలో పెద్ద కుమారుడి డామినేషన్ ఉంటుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో చిన్న కుమారుడు నాగేంద్ర డామినేషన్‌, నెగెటివ్‌ పాత్ర అయిన నాగేంద్ర నాయుడిగా శరత్‌ కుమార్ వెల్ సెటిల్డ్‌ పర్ఫామెన్స్ ఇచ్చారు. మోహన రావును తొక్కిపెట్టి కపటధారిగా ఆకట్టుకున్నారు. అలాగే మోహన రావు, నాగేంద్ర నాయుడు యుక్త వయసు పాత్రల్లో  శ్రీతేజ్, ప్రవీణ్‌ యండమూరి మంచి నటనతో మెప్పించారు. మోహన రావు భార్య, గోపి తల్లి భానుమతిగా ఆమని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాబాయ్‌ అధికారాన్ని అంతం చేయాలనే గోపి పాత్రతో నవీన్‌ చంద్రకు మంచి ఛాలెంజింగ్‌ రోల్‌ దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నవీన్‌ చంద్ర. అప్పటివరకు సైలెంట్‌గా ఉండి చివరిలో పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించే సురేష్‌ పాత్రలో ఇషాన్‌ (రోగ్‌ ఫేమ్‌) నటించి పర్వాలేదనిపించాడు. 

రచనగా హీరోయిన్‌ ఆకాంక్ష ఆకట్టుకోగా.. గోపి లవర్‌గా జెన్నీ పాత్రలో తన అందాలతో గ్లామర్‌ను యాడ్ చేసింది నైనా గంగూలి. నాగేంద్ర నాయుడి అధికారానికి నలిగిపోయే ఇందిరా పాత్రలో కస్తూరి తనదైన పరిధిలో ఆకట్టుకుంది. నరేశ్‌ కుమరన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అక్కడక్కడ వచ్చే పాటలు సన్నివేశాలకు అవసరం లేదనిపిస్తాయి. కథ కొత్తగా అనిపించకపోయిన టేకింగ్‌ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే 'పరంపర'ను చూసి కొనసాగించవచ్చని చెప్పుకోవచ్చు. 

మరిన్ని వార్తలు