ఓ పెద్ద కథ ..రెండు సినిమాలు

7 Feb, 2023 02:03 IST|Sakshi

అన్ని సినిమాలకూ కథ ఉంటుంది. కొన్ని సినిమాలకు పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ పెద్ద కథని రెండున్నర గంటల్లో చూపించలేరు. అందుకే రెండు మూడు భాగాలుగా చూపిస్తారు. అలా ఈ ఏడాది ఇటు సౌత్‌ అటు నార్త్‌లో ‘పార్ట్‌ 2’ సినిమాలు చాలానే రానున్నాయి. తొలి భాగం విడుదలై, ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కొన్ని చిత్రాలైతే తొలి, మలి భాగం రెండూ ఆన్‌సెట్స్‌లో ఉన్నాయి. ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం.

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ 2021 డిసెంబరులో రిలీజై సూపర్‌హిట్‌ అయింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’పై మరింత ఫోకస్‌ పెట్టింది ఈ టీమ్‌. ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. ‘పుష్ప: ది రూల్‌’ను ఈ ఏడాదే రిలీజ్‌ చేయా లనుకుంటున్నారు.

మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆల్రెడీ షూటింగ్‌ కూడా పూర్తి చేసుకున్న రెండో భాగం ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల కానుంది.

అలాగే తమిళంలో ‘వడ చెన్నై’, ‘అసురన్‌’ వంటి సూపర్‌ హిట్స్‌ను అందించిన దర్శకుడు వెట్రిమారన్‌ ప్రస్తుతం ‘విడుదలై’ అనే సినిమాను తీస్తున్నారు. విజయ్‌ సేతుపతి, సూరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. రెండు భాగాలకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ పూర్తయింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది వేసవిలో, రెండో బాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు.

అదే విధంగా మరో తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ (తెలుగులో ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు) చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలైంది. మలి భాగం రిలీజ్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది.

అదే విధంగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలోనే విక్రమ్‌ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అటు మలయాళంలో ‘రామ్‌’ రెండు భాగాలుగా రూపొందుతోంది. మోహన్‌లాల్‌కు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి హిట్స్‌ను అందించిన జీతూ జోసెఫ్‌ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది.

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ట్రయాలజీగా ఈ సినిమాను తీస్తున్నారు. తొలి భాగం విడుదలైన విషయం తెలిసిందే. మలి భాగం త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. అలాగే జాన్‌ అబ్రహాం హీరోగా రూపొందిన ‘ఎటాక్‌’ తొలి భాగం గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజైంది. మలి భాగం రెడీ అవుతోంది. ఇవే కాదు.. రెండు భాగాల చిత్రాలు కొన్ని సెట్స్‌లో, ఇంకొన్ని చర్చల దశల్లో ఉన్నాయి.
 

ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్‌ కె’, ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్‌’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్‌. ఈ చిత్రాలు రెండు భాగాలుగా విడుదల కానున్నాయని టాక్‌.

అలాగే హీరో ఎన్టీఆర్, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉందనే టాక్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని, తొలి భాగంలో ఎన్టీఆర్‌ హీరోగా, రెండో భాగంలో ధనుష్‌ హీరోగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇక సూర్య హీరోగా శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్‌. ఇంకా బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, రామాయణం ఆధారంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలు రానుందని టాక్‌.  

మరిన్ని వార్తలు