అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతున్న‘ఇరవిన్‌ నిళల్‌’

7 Jul, 2022 09:35 IST|Sakshi
ఇరవిన్‌ నిళల్‌ లోని ఓ సన్నివేశం

తమిళసినిమా: హీరో పార్తీబన్‌ చిత్రాలంటేనే వైవిధ్యానికి చిరునామా అనడం అతి శయోక్తి కాదు. ఈయన తన చిత్రాల్లో ప్రయోగాలతో ఆడుకుంటారు. ఇంతకు ముందు ఈయన ఏక పాత్రాభినయం చేసి తెరకెక్కించిన ‘ఒర్త చెరుప్పు – సైజ్‌ 7’ చిత్రం అందరి ప్రశంసలు అందుకుని విజయం సాధించడంతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుంది. అంతే కాకుండా ఆస్కార్‌ అవార్డు అంచుల వరకూ వెళ్లింది.

తాజాగా పార్తీపన్‌ కధానాయకుడిగా నటించి, కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రం ‘ఇరవిన్‌ నిళల్‌’ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం కూడా కమర్షియల్‌ అంశాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రం కావడం విశేషం. ఇది సింగిల్‌ షాట్‌ చిత్రీకరించిన చిత్రం.

ఇప్పటికే గిన్నీస్‌ రికార్డు, ఏషియన్‌ బుక్‌ రికార్డుల్లో నమోదయింది. తాజాగా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే మూడు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అందులో అంతర్జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు, ఈ చిత్ర ఛాయాగ్రహకుడు ఆర్ధర్‌ విల్సన్‌ రెండు అవార్డులను గెలుచుకున్నారు. మరో రెండు అంతర్జాతీయ అవార్డుల జాబితాలో ఈ చిత్రం చోటు చేసుకున్నట్లు చిత్ర వర్గాలు బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే చిత్ర ప్రివ్యూ చూసిన సినీ ప్రముఖులు ప్రశంసల  జల్లు కురిపిస్తున్నారు. ఇరవిన్‌ నిళల్‌ చిత్రం ఈ నెల 15వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. 

మరిన్ని వార్తలు