Paruchuri Gopala Krishna: వారసుడు.. క్లైమాక్స్‌ ఇలా తీసుంటే బాగుండేది

11 Mar, 2023 13:47 IST|Sakshi

వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారసుడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాపై తాజాగా ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'హీరోను పరిచయం చేసిన ఫస్ట్‌ షాట్‌ అద్భుతంగా ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేసిన విజయ్‌, వంశీలను అభినందించాలి. పెద్దింటి పేరెంట్స్‌కు ముగ్గురు కొడుకులు ఉంటారు. వారు ఇల్లు వదిలి వెళ్లిపోతే తిరిగి ఇంటికి తీసుకొచ్చే తమ్ముడి కథ ఇది. హీరో అమ్మచాటు బిడ్డ. కానీ నాన్న కోసం ఎంతో త్యాగం చేస్తాడు.

తండ్రి బతికే అవకాశం లేదని తెలిసినప్పుడు మూడో కొడుకును తన స్థానంలో హెడ్‌గా కూర్చోబెడతాడు. దీంతో కోపంతో మిగతా ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, అలాంటి వారి బారి నుంచి కాపాడాలంటే చిన్నవాడే బెటర్‌ అనుకుంటాడు తండ్రి. ఎందుకంటే అప్పటికే పెద్ద కొడుకు శ్రీకాంత్‌కు ఒకరితో ఎఫైర్‌ ఉంటుంది.  రెండో కుమారుడు సొంత కుటుంబానికే ద్రోహం చేయాలని చూస్తాడు.

2.49 గంటల సినిమాలో ప్రేమ చాలా తక్కువగా ఉంది. పాటల కోసం రష్మికను వాడుకున్నారు. ఉమ్మడి వ్యవస్థ, కుట్రలు, కుతంత్రాలు, విడిపోవడాలు.. వీటికి ఎక్కువ నిడివి ఇచ్చారు. దాన్ని కొంచెం కట్‌ చేసి హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఎక్కువ చూపించి ఉంటే బాగుండేది. ఓ సీన్‌లో విజయ్‌ను చైర్మన్‌గా ఎన్నుకోవడానికి తక్కువ ఓట్లు పడ్డాయి. అప్పుడు విజయ్‌ ఓటేసేవాళ్ల తప్పులను ఎత్తిచూపడంతో వెంటనే వారు మనసు మార్చుకుని హీరోకే ఓటేస్తారు. ఆ సీన్‌ బాగుంది. వందమందినైనా కొట్టే హీరో తన అన్నయ్య మీద ఒక్క దెబ్బ కూడా వేయడడు. మరొకటి.. తండ్రి అనారోగ్యాన్ని తల్లికి, అన్నలకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడతాడు.

అయితే ఒకానొక దశలో తండ్రి సామ్రాజ్యం కుప్పకూలేట్లుగా ఉంటే హీరో దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలను హీరో ఇంటికి తీసుకొచ్చేస్తాడు. లెవంత్‌ అవర్‌లో తండ్రి అస్థికలు నదిలో కలిపినట్లు చూపించారు. అంతా బాగుంది కానీ ఆ షాట్‌ చూపించకపోయుంటే బాగుండేది. అస్థికలు కలిపినట్లు కాకుండా హీరోయిన్‌తో హీరో పెళ్లి చేసి తండ్రి అక్షింతలు వేసినట్లు చూపించాల్సింది. ఎంతో కష్టపడ్డ హీరో తండ్రిని కాపాడుకోలేనట్లు చూపించకుండా.. 'నాన్నా..  అంతా సెట్‌ చేశాను. ఇక నేను తిరిగి అమెరికా వెళ్లిపోతున్నాను' అని చెప్పి ఉంటే బాగుండేది. హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఇంకో పావుగంటయినా పెంచాల్సింది. అలాగే శ్రీకాంత్‌తో ఎఫైర్‌ పెట్టుకున్న అమ్మాయి ఏమైందో చూపించలేదు? చిన్నచిన్న పొరపాట్లు మినహా సినిమా బాగుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి.

మరిన్ని వార్తలు