Pathaan Movie: షారుక్‌ పఠాన్‌ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్‌, మూవీ టీంకు బోర్డు ఆదేశం..

29 Dec, 2022 13:20 IST|Sakshi

షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'పఠాన్'. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చూట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్‌ రో' సాంగ్‌పై పలువురు రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు విమర్శలు గుప్పించారు. ఈ పాటలో దీపికా ధరించిన డ్రెస్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్‌ చేశారు.

అంతేకాదు దీపికాపై పలువురు పొలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అదే విధంగా పాటలో మార్పులు చేయాలంటూ పలుచోట్లు షారుక్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పఠాన్‌ చిత్రం మరోసారి చిక్కులో పడింది. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, పాటల విజువల్స్‌పై సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అభ్యంతరంగా ఉన్న పలు సన్నివేశాలను వెంటనే తొలగించాల్సిందిగా పఠాన్‌ చిత్ర బృందాన్ని ఆదేశించింది.

తాము చెప్పిన విధంగా సినిమాల్లో మార్పులు చేసిన అనంతరం సెన్సార్‌ సర్టిఫికేట్‌ కోసం తిరిగి రమ్మని మూవీ టీంకు సెన్సార్‌ బోర్డు సూచించినట్లు సమాచారం. దీంతో పఠాన్‌ టీం సెన్సార్‌ బోర్డ్‌ ఆదేశం మేరకు చిత్రంలో మార్పులు చేసే పనిలో పడింది. కాగా ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్దార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో జాన్‌ అబ్రహ్యం విలన్‌గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. 

చదవండి: 
టాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ నటుడు వల్లభనేని జనార్ధన్‌ మృతి
విషాదంలో రకుల్‌.. మిస్‌ యూ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

మరిన్ని వార్తలు