గ‌ర్భ‌శోకాన్ని అర్థం చేసుకోగ‌ల‌ను: ప‌వ‌న్

2 Sep, 2020 11:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అభిమాన హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభవంగా జ‌ర‌పాల‌ని భావించిన ఓ ముగ్గురిని క‌రెంట్ కాటేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ చిత్తూరులోని శాంతిపురంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో జ‌న‌సేన పార్టీ ద్వారా మంగ‌ళ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గుండెల నిండా తనపై అభిమానం నింపుకున్న సోమ‌శేఖ‌ర్‌, రాజేంద్ర‌, అరుణాచ‌లం విద్యుత్ షాక్‌తో దుర్మ‌ర‌ణం పాల‌వ‌డం దిగ్భ్రాంతికి గురి చేసింద‌న్నారు. శాంతిపురం ద‌గ్గ‌ర క‌టౌట్ క‌డుతుంటే విద్యుత్ షాక్ త‌గ‌ల‌డం వల్ల వారు చ‌నిపోయార‌నే వార్త తన మ‌న‌సును క‌లిచివేసింద‌ని పేర్కొన్నారు. (చ‌ద‌వండి: పవన్‌ కళ్యాణ్‌ బ్యానర్‌ కడుతూ ముగ్గురి దుర్మరణం)

ఇది మాట‌ల‌కు అంద‌ని విషాద‌మ‌ని, మృతుల ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆ త‌ల్లిదండ్రుల గ‌ర్భ‌శోకాన్ని అర్థం చేసుకోగ‌ల‌ను.. దూర‌మైన బిడ్డ‌ల‌ను తిరిగి తీసుకురాలేను క‌నుక వారికి తానే ఓ బిడ్డ‌గా నిలుస్తాన‌ని తెలిపారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుబాల‌కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ చొప్పున ఆర్థిక స‌హాయం అందించాల‌ని పార్టీ కార్యాల‌య సిబ్బందిని ప‌వ‌న్ ఆదేశించారు. అలాగే మరో న‌లుగురు హ‌రికృష్ణ‌, ప‌వ‌న్‌, సుబ్ర‌హ్మ‌ణ్యం, అరుణ్ చికిత్స పొందు‌తున్నార‌ని, వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాల‌ని స్థానిక నాయకుల‌ను ఆదేశించారు. వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దైవాన్ని ప్రార్థించారు. (చ‌ద‌వండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపె​ట్టిన అనికా!)

మీ ప్రాణం కంటే ఏదీ విలువైన‌ది కాదు
ఈ ఘ‌ట‌న‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. చిత్తూరులో ప‌వ‌న్ బ‌ర్త్‌డేకు బ్యాన‌ర్ క‌డుతూ ముగ్గురు మ‌ర‌ణించ‌డం గుండెను క‌లిచివేసింద‌న్నారు. అభిమానులు ప్రాణ‌ప్ర‌‌దంగా ప్రేమిస్తార‌ని తెలుసు.. కానీ మీ ప్రాణం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలని సూచించారు. మీ కుటుంబానికి మీరే స‌ర్వ‌స్వం అన్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ని కోరారు. ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ ఏర్పాట్ల‌లో ఆయ‌న‌ ముగ్గురు అభిమానులు మ‌ర‌ణించ‌డం విషాద‌క‌ర‌మ‌ని హీరో వ‌రుణ్ తేజ్ అన్నారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ద‌య‌చేసి అంద‌రూ ఎల్ల‌వేళ‌లా క‌నీస జాగ్ర‌త్త‌లు పాటించండ‌ని కోరారు. "నిన్న కుప్పంలో జ‌రిగిన దుర్ఘ‌ట‌నలో ముగ్గురు అభిమానులు కాలం చేశార‌నే వార్త న‌న్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏదీ విలువైన‌ది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకుని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నా మ‌న‌వి. ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి" అని మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. (చ‌ద‌వండి: కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసిన హాస్య న‌టి)

మరిన్ని వార్తలు