ఆ అర్హత ఆయనకు లేదు : బిగ్‌బీకి ఎదురుదెబ్బ 

8 Jan, 2021 15:23 IST|Sakshi

ఆయనేమీ కరోనా యోధుడు కాదు : పిటిషనర్‌

కరోనా కాలర్‌ట్యూన్‌కు  ఉచితంగా వాయిస్‌ ఇచ్చేందుకు చాలా మంది ఉన్నారు

అమితాబ్‌పై కోర్టులో అనేక  పెండింగ్‌లో ఉన్నాయి

సాక్షి, ఢిల్లీ: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అద్భుతమైన నటనకు తోడు, ఆయన వాయిస్ బంగారానికి తావి అబ్బిందా అన్నట్టుగా అతికిపోతుంది. అలనాటి ‘దో బూంద్‌ జిందగీ కే లియే’ అనే పోలీయో వ్యాక్సిన్‌ యాడ్‌ నుంచి, ఈనాటి కరోనా వైరస్‌ కాలర్‌ ట్యూన్‌ వరకూ ఆయన వాయిస్‌ విన్నవారెవ్వరైనా  బిగ్‌బీకి ఫిదా అవ్వకు మానరు. అయితే ఇపుడు అమితాబ్‌ గళమే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే కరోనా కాలర్‌ట్యూన్‌ వాయిస్‌కు బిగ్‌బీ అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త  కోర్టులో పిటిషన్ వేశారు. అమితాబ్‌ గొంతును ఆ కాలర్‌ట్యూన్‌ నుంచి తొలగించాలని  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

కాలర్‌ ట్యూన్‌లో జాగ్రత్తలు  బోధిస్తున్న అమితాబ్‌  స్వయంగా కరోనా బారిన పడ్డారని, ఇక ఆయన ఎలా సలహా ఇస్తారని పిటిషనర్‌ వాదించారు. ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కదా అరోపించారు. అంతేకాదు  రెమ్యూనరేషన్‌ తీసుకొని వాయిస్‌ చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎంతో మంది కరోనా యోధులతోపాటు, సినిమా ప్రముఖులు సమాజ సేవలో పాల్గొన్నారని, పేదలకు భోజనం పెట్టడంతో పాటు వసతి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్ ట్యూన్‌కు ఉచితంగా వాయిస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అమితాబ్ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారని  పేర్కొన్నారు.  అమితాబ్‌ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడని, ఆయనపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆరోపించడం గమనార్హం. మరోవైపు  ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, తదుపరి విచారణను జనవరి 18కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌.పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌ ధర్మాసనం విచారించింది.  

మరిన్ని వార్తలు