PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ

17 Mar, 2023 13:35 IST|Sakshi
Rating:  

టైటిల్‌: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు
నిర్మాణ సంస్థలు :  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
దర్శకుడు:  శ్రీనివాస్ అవసరాల
సంగీతం: కళ్యాణి మాలిక్‌, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ నామ
ఎడిటర్‌ : కిరణ్‌ గంటి
విడుదల తేది: మార్చి 17, 2023
Rating: 2.5/5

Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత  నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్‌లో జాయిన్‌ అయిన సంజయ్‌ని సీనియర్స్‌ ర్యాగింగ్‌ చేస్తుంటే.. అతన్ని సేవ్‌ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్‌). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్‌ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్‌ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్‌.

అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్‌, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్‌ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్‌) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్‌, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
సినిమా భాషలో కాంబినేషన్‌ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్‌ కలిసి చేసిన సినిమా హిట్‌  అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్‌ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్‌గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్‌ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్‌ అయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది.

ఇక సెకండాఫ్‌ ఇద్దరి మధ్య  మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు.  పార్ట్‌ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్‌ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు. 

ఎవరెలా చేశారంటే...
సంజయ్‌గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్‌ ఫీల్‌ గుడ్‌ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్‌ బాయ్‌గా సంజయ్‌ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్‌ ఉన్నంతలో మెప్పించాడు. 

వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్‌ కుమార్‌ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు