ఆ నిజాన్నే ఆవిష్కరిస్తుంది ‘పికాసో’

23 Mar, 2021 02:36 IST|Sakshi

వెబ్‌ఫ్లిక్స్‌ 

ఇష్టంగా గీసుకున్న బొమ్మంత కుదురుగా.. మనసుపెట్టి రంగులు అద్దుకున్నంత కలర్‌ఫుల్‌గా జీవితం ఉంటే ఎంత బాగుంటుంది? విధి ఆలోచన మనిషి ఊహకు అందదు ఎప్పుడూ! అది ఏ మలుపు దగ్గర నిలబెడితే ఆ మలుపు నుంచి కొత్తగా ప్రయాణం మొదలుపెట్టడమే.. కొనసాగడమే!! ఊతంగా కళను పట్టుకోవడమే! ఎందుకంటే జీవితాన్ని ఆస్వాదించే ప్రక్రియను నేర్పేది కళే కాబట్టి! ఆ నిజాన్నే ఆవిష్కరిస్తుంది ‘పికాసో’  చిత్రం. పిల్లలు, పెద్దలు కలిసి చూడాల్సిన ఈ మరాఠీ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.. 

సీన్‌లోకి...
‘నువ్వే కదా నాన్నా.. రంగుల్లో బ్రష్‌లు ముంచి బొమ్మలు గీయడం నేర్పించావ్‌? ఇప్పుడు ఆ కళే వద్దని కోప్పడ్తున్నావ్‌ ఎందుకు నాన్నా?’ ప్రశ్నిస్తాడు తండ్రిని పన్నెండేళ్ల గంధర్వ్‌ గవాడే (సమయ్‌ సంజీవ్‌ తాంబే).
 
‘నీ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు’ అంటాడు ఆ తండ్రి కొడుకు కళ్లల్లోకి చూడకుండానే. అతను.. పాండురంగ్‌ గవాడే (ప్రసాద్‌ ఓక్‌). ఒక కళాకారుడు. కుంచెతో, ఉలితో, పాటతో, అభినయంతో కళను ప్రదర్శిస్తుంటాడు. అన్నిట్లోనూ మేటి. బొమ్మలు వేయడమంటే ప్రాణం అతనికి. పెద్ద ఆర్టిస్ట్‌ అయిపోవాలని కలలు కన్నాడు. పెళ్లితో వచ్చిపడ్డ బాధ్యతలు కళోపాసనలో అతణ్ణి ముందుకు సాగనివ్వవు. తనకు తెలిసిన ఆ విద్యను ఉపాధిగా మలుచుకుంటాడు. అదీ కుటుంబ అవసరాలను తీర్చదు. గంధర్వ్‌ పుట్టాక.. వాడినైనా మంచి చిత్రకారుడిగా తీర్చిదిద్దాలనుకుంటాడు. అందుకూ తన ఆర్థికస్థితి సహకరించదు. అందుకే ఆ అసహనాన్ని, నిస్సహాయతను, కోపాన్ని మద్యం మీద మోజు పడటం ద్వారా తీర్చుకుంటాడు.

నాటకం వేసేప్పుడు కూడా తాగే రంగస్థలం ఎక్కుతాడు. దాంతో ఆ అలవాటు అతని ఆద్భుతమైన వాచకం, గానం, నటనకు ఓ మచ్చలా మారిపోతుంది. ప్రేక్షకుల్లో కూడా అతనిపట్ల ఒక రకమైన ఏవగింపు కలుగుతుంది. నాటక సంస్థ యజమానికీ పాండురంగ్‌ చులకనై పోతాడు. పైగా ఇంటి ఖర్చుల కోసం అతను చేసిన, చేస్తున్న అప్పులూ ఆ చులకన భావాన్ని పెంచి పోషిస్తుంటాయి. తోటి కళాకారులకూ అతని పట్ల గౌరవం పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే.. పక్క ఊళ్లో నాటకం వేయడానికి వెళ్తాడు పాండురంగ్‌. ఆ సమయంలోనే కొడుకు   తండ్రిని ఆ ప్రశ్న అడుగుతాడు. 

గంధర్వ్‌కు అలా అడగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?
ఏడవ తరగతి విద్యార్థి గంధర్వ్‌. వాళ్ల నాన్న చిత్రకళకు వారసుడు. పికాసో చిత్రకళ స్కాలర్‌షిప్‌ పోటీల్లో మహారాష్ట్ర స్టేట్‌ ఫస్ట్‌గా గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుంటాడు. జాతీయ స్థాయి పోటీలో కూడా పాల్గొని గెలుపొందితే స్పెయిన్‌ లో ఏడాది పాటు చిత్రకళలో శిక్షణపొందే అవకాశం దొరుకుతుంది. ఆ సమాచారం గంధర్వ్‌కు ఆలస్యంగా చేరుతుంది పోస్ట్‌లో. దరఖాస్తు చేసుకోవడానికి తెల్లవారే ఆఖరు తేదీ. దరఖాస్తు ఫారానికి పదిహేను వందల రూపాయల రుసుమూ చెల్లించాల్సి ఉంటుంది. అదే గంధర్వ్‌ కు అసలు పరీక్ష. గోల్డ్‌మెడల్‌ పట్టుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి చెప్తాడు విషయాన్ని. సంతోషంగా కొడుకును హత్తుకుంటుంది. కాని పదిహేనువందల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తుంది? తెల్లవారి తన వైద్యపరీక్షకు డబ్బుకోసమే నానా ఇబ్బందులూ పడ్తుంటే ఇప్పుడు కొడుకు క్వాయిష్‌ను ఎలా తీర్చడం? ఆమె ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడే ‘నాన్న ఎక్కడ?’ అని అడుగుతాడు గంధర్వ్‌.

పక్క ఊర్లో నాటకం వేయడానికి వెళ్లాడని చెప్తుంది తల్లి. అంతే! ఉన్న ఫళంగా ఆ ఊరికి బయలుదేరుతాడు గంధర్వ్‌. మేకప్‌ వేసుకుంటున్న తండ్రి దగ్గరకు వెళ్లి తన గోల్డ్‌ మెడల్‌ చూపించి.. తర్వాత రాబోయే అవకాశం గురించీ చెప్తాడు. కొడుకు విజయానికి గర్వించినా.. పదిహేను వందల రూపాయలు పెట్టి పంపించలేని తన అసహాయతను ‘చిత్రకళనే మర్చిపో’ అనే మందలింపుతో బయటపెడ్తాడు. కొడుకు కళ్లల్లోని బాధ ఆ తండ్రిని నిలువనివ్వదు. ఆ వేదననంతా ఆ నాటకంలోని తన పాత్ర అభినయం మీద పెడ్తాడు. ఆ క్షణం దాకా లోపించిన తన ఏకాగ్రతను చిక్కబట్టుకుంటాడు. మొత్తం నాటకాన్నే రక్తి కట్టిస్తాడు. ఆరోజుదాకా ఏవగించుకున్న ప్రేక్షకులు జయజయధ్వానాలతో పాండురంగ్‌ను ప్రశంసిస్తారు. డబ్బుల మాలలతో పాండురంగ్‌ను సత్కరిస్తారు. నాటక సంస్థ యజమానీ ఆ రోజు పారితోషికమే కాదు.. బక్షిష్‌ నూ ఇస్తాడు సంతోషంగా. ఆ రోజు తండ్రిలో కనిపించిన కళారాధనకు గంధర్వ్‌ కూడా మురిసిపోతాడు. పాండురంగ్‌కు ఆ రోజు భార్య వైద్యపరీక్షకే కాదు కొడుకు దరఖాస్తుకూ సరిపోయేంతగా డబ్బు వస్తుంది. కళారాధన జీవితాన్ని స్వస్థపరిచే ఒక ఔషధం.. కళ మీద నమ్మకం కలలను తీర్చే సాధనం.. అని చెప్తుందీ సినిమా. దీనికి దర్శకుడు అభిజీత్‌ మోహన్‌ వరంగ్‌.

దశావతార్‌ జానపద నాటక కళ
చిత్రకళను అంశంగా తీసుకున్న సినిమా మొత్తం సాగింది మహారాష్ట్ర దక్షిణ కొంకణ్‌ ప్రాంతానికి చెందిన ‘దశావతార్‌’ అనే జానపద నాటక కథ మీదే. ప్రపంచంలోనే మొదటి జానపద నాటక కళ ఇది. క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో దక్షిణ కొంకణ్, వలవల్‌ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణమే వేదికగా ప్రారంభమై.. నేటికీ మనుగడలో ఉంది. రాజుల ఆదరణ, పోషణతో కాకుండా ప్రజాదరణ, పోషణతో. నేటికీ  దాదాపు 3 లక్షల 50 వేల మంది కళాకారులకు ఇదే జీవనాధారం. ఈ సినిమాలోని నాటక దృశ్యాలనూ ఆ ఆలయ ప్రాంగణంలోనే చిత్రీకరించారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు