Pitta Kathalu Review: ‘పిట్ట కథలు’ ఎలా ఉందంటే..

21 Feb, 2021 00:17 IST|Sakshi

వెబ్‌ యాంథాలజీ: పిట్టకథలు’;
తారాగణం: జగపతిబాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, మంచులక్ష్మి, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా;
దర్శకులు: తరుణ్‌ భాస్కర్‌– నందినీ రెడ్డి – నాగ్‌ అశ్విన్‌ – సంకల్ప్‌ రెడ్డి;
ఓటీటీ: నెట్‌ ఫ్లిక్స్‌;
రిలీజ్‌: ఫిబ్రవరి 19

వేర్వేరు రచయితలు, కవులు రాసిన కొన్ని కథలనో, కవితలనో, గేయాలనో కలిపి, ఓ సంకలనం (యాంథాలజీ)గా తీసుకురావడం సాహిత్యంలో ఉన్నదే! మరి, వేర్వేరు దర్శకులు రూపొందించిన కొన్ని వెండితెర కథలను గుదిగుచ్చి, తెరపైకి తీసుకువస్తే? అదీ యాంథాలజీనే. ఓటీటీ వేదికలు వచ్చాక పెరిగిన ఈ వెబ్‌ యాంథాలజీల పద్ధతి ఇప్పుడు తెలుగులో కూడా ప్రవేశించింది. తమిళంలో గత ఏడాది ‘పుత్తమ్‌ పుదు కాలై’ (అమెజాన్‌ ప్రైమ్‌), ఈ ఏడాది ‘పావ కదైగళ్‌’ (నెట్‌ ఫ్లిక్స్‌) లాంటివి వచ్చాయి. గత సంవత్సరమే తెలుగులో ‘మెట్రో కథలు’ (ఆహా) లాంటి ప్రయత్నాలూ జరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయ నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ తెలుగులో తొలిసారి తమ ఒరిజినల్‌ ఫిల్మ్‌గా అందించిన వెబ్‌ యాంథాలజీ ‘పిట్టకథలు’. 

పాపులర్‌ దర్శకులు తరుణ్‌ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్‌ అశ్విన్, సంకల్ప్‌ రెడ్డి ఈ పిట్టకథలను రూపొందించారు. మన చుట్టూ ఉన్న మనుషుల కథలు, వాళ్ళ మనసులోని వ్యధలు, ప్రేమలు, మోసాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు – ఇలా చాలా వాటిని ఈ కథలు తెర మీదకు తెస్తాయి. స్త్రీ పురుష సంబంధాల్లోని సంక్లిష్టతతో పాటు, వారి మధ్య పవర్‌ ఈక్వేషన్‌ను కూడా చర్చిస్తాయి. 

నేటివిటీ నిండిన ‘రాములా’: 
‘పెళ్ళిచూపులు’ తరుణ్‌ భాస్కర్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు రాసుకొని, దర్శకత్వం వహించిన ‘రాములా’ గ్రామీణ నేపథ్యంలోని ఓ టిక్‌ టాక్‌ అమ్మాయి రాములా (శాన్వీ మేఘన) కథ. తోటి టిక్‌ టాక్‌ కుర్రాడు (నవీన్‌ కుమార్‌) ప్రేమిస్తాడు. కానీ, పెద్దల కోసం మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైనప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? ఓ అమ్మాయి కష్టాన్ని మహిళామండలి అధ్యక్షురాలు స్వరూపక్క (మంచు లక్ష్మి) ఎలా వాడుకుంది ఈ కథలో చూడవచ్చు. సహజమైన నటనతో, తెలంగాణ నేపథ్యంలో, అదే మాండలికంలోని డైలాగ్స్‌ తో ఈ పిట్టకథ – జీవితాన్ని చూస్తున్నామనిపిస్తుంది. క్లైమాక్స్‌ గుండె పట్టేస్తుంది. 

హాట్‌ హాట్‌ చర్చనీయాంశం ‘మీరా’: 
‘ఓ బేబీ’ ఫేమ్‌ నందినీరెడ్డి రూపొందించిన ‘మీరా’ – అనుమానపు భర్త (జగపతిబాబు) శారీరక హింసను భరించే పద్ధెనిమిదేళ్ళ వయసు తేడా ఉన్న ఓ అందమైన భార్య (అమలాపాల్‌) కథ. రచయిత్రి మీరా ఆ హింసను ఎంతవరకు భరించింది, చివరకు ఏం చేసిందనేది తెరపై చూడాలి. లక్ష్మీ భూపాల్‌ మాటలు కొన్ని చోట్ల ఠక్కున ఆగేలా చేస్తాయి. డిప్రెషన్‌తో బాధపడుతూ, భార్యను బతిమలాడే లాంటి కొన్ని సన్నివేశాల్లో జగపతిబాబులోని నటప్రతిభ మరోసారి బయటకొచ్చింది. అమలా పాల్‌ కూడా టైటిల్‌ రోల్‌ను సమర్థంగా పోషించారు. వంశీ చాగంటి, కిరీటి దామరాజు, ప్రగతి లాంటి పరిచిత నటీనటులతో పాటు నిర్మాణ విలువలూ బాగున్నాయి. హాట్‌ దృశ్యాలతో పాటు, హాట్‌ హాట్‌ చర్చనీయాంశాలూ ఉన్న చిత్రం ఇది. ట్విస్టులు, కీలక పాత్ర ప్రవర్తన అర్థం కావాలంటే రెండోసారీ చూడాల్సి వస్తుంది. 

టెక్నాలజీ మాయలో పడితే... ‘ఎక్స్‌ లైఫ్‌’: 
‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ తీసిన పిట్టకథ ‘ఎక్స్‌ లైఫ్‌’ ఓ సైన్స్‌ఫిక్షన్‌. దర్శకుడు క్రిష్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పిన ఈ కథ భవిష్యత్‌ దర్శనం చేయిస్తుంది. ప్రపంచంలోని మనుషులందరినీ కేవలం డేటా పాయింట్లుగా భావించే విక్రమ్‌ రామస్వామి అలియాస్‌ విక్‌ (సింగర్‌ సన్నత్‌ హెగ్డే) ఎక్స్‌ లైఫ్‌ అంటూ ప్రపంచంలోనే అత్యాధునిక వర్చ్యువల్‌ రియాలిటీ కంపెనీ నడుపుతుంటాడు. మనుషుల్లోని ప్రేమను చంపేసే టెక్నాలజీని నమ్ముకున్న మాయాలోకం అది. అక్కడ కిచెన్‌లో పనిచేసే అమ్మాయి దివ్య (శ్రుతీహాసన్‌)ను చూసి, అమ్మ గుర్తొచ్చి, ప్రేమలో పడతాడు. తరువాత ఏమైందన్నది ఈ కథ. టెక్నాలజీ లోకపు పెను అబద్ధాల కన్నా చిరు సంతో షాలు, ప్రేమలు దొరికిన జీవితమే సుఖమనే తత్త్వాన్ని క్లిష్టంగా బోధపరుస్తుందీ కథ.  

అసంపూర్తి అనుబంధాల... ‘పింకీ’: 
‘ఘాజీ’, ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు తీసిన సంకల్ప్‌ రెడ్డి రూపొందించిన పిట్ట కథ ‘పింకీ’. ఇద్దరు దంపతుల (సత్యదేవ్‌ – ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌ – ఆషిమా నర్వాల్‌) మధ్య మారిన అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ప్రేమ కోసం పరితపించే ఒకరు, పాత జ్ఞాపకాలను వదిలించుకోవాలనుకొనే మరొకరు... ఇలాంటి వివిధ భావోద్వేగాలతో నాలుగు పాత్రలు కనిపిస్తాయి. ఆ అనుబంధాల క్రమాన్ని కానీ, చివరకు వారి పర్యవసానాన్ని కానీ పూర్తి స్థాయిలో చూపకుండా అసంపూర్తిగా ముగిసిపోయే కథ ఇది. ఈ యాంథాలజీలో ఒకింత ఎక్కువ అసంతృప్తికి గురిచేసే కథా ఇదే. 

ప్రధానంగా స్త్రీ పాత్రల చుట్టూ తిరిగే ఈ పిట్టకథల్లో పేరున్న కమర్షియల్‌ చిత్రాల తారల అభినయ కోణం కనిపిస్తుంది. సంగీతంలో వివేక్‌ సాగర్‌ (‘రాములా’), మిక్కీ జె మేయర్‌ (‘మీరా’), ప్రశాంత్‌ కె. విహారి (‘పింకీ’) లాంటి పేరున్న సాంకేతిక నిపుణులు పనిచేశారు. అలాగే, ఛాయాగ్రహణం, ఆర్ట్‌ వర్క్‌లోనూ పాపులర్‌ టెక్నీషియన్లు ఉన్నారు. నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, నవతరం దర్శకులు తీసిన ఈ కథలన్నిటిలో లవ్‌ మేకింగ్‌ సీన్లు ఎదురవుతాయి. అశ్లీలపు మాటలూ వినిపిస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌లో చూస్తే అది ఇబ్బంది కాకపోవచ్చు. కానీ, సకుటుంబంగా చూడాలంటే కష్టమే. చిరకాలంగా ‘నెట్‌ ఫ్లిక్స్‌’ ఊరిస్తూ వచ్చిన ఈ యాంథాలజీలో నాలుగు కథలూ ఒకే స్థాయిలో లేకపోవడమూ చిన్న అసంతృప్తే. 

కొసమెరుపు: ‘పిట్టకథలు’... అద్భుతంగా ఉన్నాయనలేం... అస్సలు బాగా లేవనీ అనలేం!

బలాలు
♦సమాజంలోని కథలు
♦పాపులర్‌ దర్శకులు, నటీనటుల ప్రతిభ
♦నిర్మాణ విలువలు
బలహీనతలు 
♦హాట్‌ సన్నివేశాలు
♦కొన్ని అసంతప్తికర కథనాలు

రివ్యూ: రెంటాల జయదేవ 

మరిన్ని వార్తలు