సినిమా ఫైనాన్సియర్‌ నిర్బంధం.. నగలు, నగదు అపహరణ

3 Jul, 2021 09:23 IST|Sakshi

  నగలు, నగదు అపహరణ

 స్నేహితుడు సహా ఇద్దరి అరెస్టు 

చెన్నై: సినిమా ఫైనాన్సియర్‌ను ఇంట్లో నిర్బంధించి నగలు, నగదు అపహరించిన స్నేహితుడు సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సినిమా ఫైనాన్సర్‌ అరెస్టయ్యాడు. చెన్నై సమీపంలోని తురైపాక్కం శక్తినగర్‌కు చెందిన నిర్మల్‌ జెమినీ కన్నన్‌ (33). భార్య కృత్తిక (28)తో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇతనికి చెన్నైకి చెందిన హరికృష్ణన్‌ (48)తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద రూ.13 లక్షలు రుణంగా తీసుకున్నట్లు సమాచారం. ఈ నగదు తిరిగి ఇవ్వకుండా దంపతులు హరికృష్ణన్‌ను మోసగించినట్లు తెలిసింది. దీంతో హరికృష్ణన్‌ తన స్నేహితుడు, సినిమా ఫైనాన్సియర్‌ చెన్నై విరుగంబాక్కంకు చెందిన లయన్‌ కుమార్‌ (48)ను మధ్యవర్తిత్వం కోసం  సంప్రదించాడు.

అతను గత ఫిబ్రవరిలో తురైపాక్కంలోని నిర్మల్‌ జెమినీ కన్నన్‌ ఇంటికి పంచాయితీ కోసం వెళ్లాడు. సినిమాకు ఉపయోగించే తుపాకీతో బెదిరించి కారు, మోటారు సైకిల్, నాలుగు గ్రాముల బంగారంను తీసుకుని వెళ్లినట్లు సమాచారం. అయితే దంపతుల వద్ద నుంచి తీసుకున్న నగదు, నగలు, వస్తువులు హరికృష్ణన్‌కు ఇవ్వకుండా లయన్‌కుమార్‌ ఉంచుకున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన హరికృష్ణన్, నిర్మల్‌ జెమినీ కన్నన్‌ దంపతులతో ఒప్పందం కుదుర్చుకుని ఫైనాన్సియర్‌ వద్ద నుంచి వాటిని తిరిగి రాబట్టుకునేందుకు నిర్ణయించాడు.

గత 27వ తేది ఫైనాన్సియర్‌ లయన్‌ కుమార్‌కు పుట్టినరోజు అని తెలియడంతో తురైపాక్కంలోని ఇంటిలో వేడుక జరుపుకుందామని చెప్పి ఆహ్వానించారు. లయన్‌కుమార్‌ను నిర్మల్‌ జెమినీ కన్నన్, అతని భార్య కృత్తిక, హరికృష్ణన్‌ ఇంట్లో  నిర్భంధించి దాడి చేశారు. అతని వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, 18 సవర్ల బంగారు నగలు అపహరించి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. డీఎస్పీ రవి  ఇంటికి వచ్చి లయన్‌కుమార్‌ను విడిపించారు. తురైపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి హరికృష్ణన్, నిర్మల్‌ జెమినీ కన్నన్‌లను అరెస్టు చేశారు. అలాగే ఫైనాన్సియర్‌ లయన్‌ కుమార్‌ అరెస్టయ్యాడు. ఈ కేసులో కృత్తిక, వారికి సహకరించిన స్టీఫెన్‌ కోసం గాలిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు