Ponniyin Selvan 1: ఈ తరానికి పుస్తకాలు చదవడానికి కూడా సమయం ఉండట్లేదు.. కార్తీ

10 Jul, 2022 13:21 IST|Sakshi

తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం ఏ తరహా కథా చిత్రాన్ని తెరకెక్కించినా అందులో తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. పలువురు సినీ దిగ్గజాలు చేయడానికి ఆసక్తి కనబరచి చేయలేకపోయిన అసాధారణ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ను ఒక మహా యజ్ఞంలా భావించి పూర్తి చేశారు. అత్యధిక పాఠకుల మనసులను దోచుకున్న చారిత్రక నవల ఇది. రాజరాజ చోళన్‌ నేపథ్యంతో విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్‌ ప్రభు వంటి భారీ తారాగణంతో మణిరత్నం చిత్రంగా చెక్కారు.

లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహ్మాన్, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్‌ 30వ తేదీన చిత్రంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా చిత్ర టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు.

ఇందులో కార్తీ మాట్లాడుతూ.. ఈ తరానికి చెందిన వారికి పుస్తకాలు చదవడానికి సమయం ఉండటం లేదన్నారు. 10 నిమిషాలు వీడియోలు చూడటంతో సరిపెట్టుకుంటున్నారని, అయితే అందరూ చరిత్ర నవలను చదవాలన్నారు. మణిరత్నం ఐదు భాగాలతో కూడిన నవలను చిత్రంగా మలిచారని పేర్కొన్నారు. పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం ఆయన మనకు అందిస్తున్న కానుకగా పేర్కొన్నారు. రాజరాజ చోళన్‌ తమిళ భాషను, దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఇప్పుడు మణిరత్నం ఈ చిత్రం ద్వారా పని చేస్తున్నారని త్రిష అన్నారు. మణిరత్నం గారు ఫోన్‌ చేసి పొన్నియన్‌ సెల్వన్‌ పాత్రను నువ్వే చేస్తున్నావని చెప్పారని, ఈ వేదిక కంటే అప్పుడు ఆయన చెప్పిన మాటే ఒళ్లు పులకరింపచేస్తోందని నటుడు జయం రవి పేర్కొన్నారు.

గత 30 ఏళ్లుగా తన బాస్‌ మణిరత్నం అని, ప్రతి ఒక్కరిలోని ప్రతిభను ఎలా బయటకు తీసుకురావాలన్నది ఆయన నుంచే నేర్చుకున్నానని ఏఆర్‌ రెహ్మాన్‌ అన్నారు. ఈ చిత్ర సంగీతం కోసం పలు ప్రాంతాలు తిరిగి పరిశోధనలు నిర్వహించినట్లు చెప్పారు. తాను కళాశాల దశలోనే పొన్నియన్‌ సెల్వన్‌ నవల చదివానని, 40 ఏళ్లకు పైగా అయినా అది గుండెల్లోంచి తొలగిపోలేదని మణిరత్నం చెప్పారు. మక్కల్‌ తిలకం ఎంజీఆర్‌ నటించాల్సిన చిత్రం ఇదని, నాడోడి మన్నన్‌ చిత్రం తరువాత ఈ చిత్రం చేయాలని ప్రయత్నించారని, అది జరగలేదని గుర్తు చేశారు. అప్పుడు ఎందుకు కుదరలేదో ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. ఆయన తమ కోసం వదలి వెళ్లారన్నారు. ఆ తరువాత కూడా చాలా మంది ప్రయత్నించారని, తాను మూడు సార్లు ప్రయత్నించానన్నారు. 1980 నుంచి ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికి సాధ్యం అయ్యిందని మణిరత్నం తెలిపారు.

చదవండి: పవిత్రా లోకేశ్‌ నా భార్యే: సుచేంద్రప్రసాద్‌
నా దృష్టిలో లక్‌ అంటే అదే : తమన్నా

మరిన్ని వార్తలు