Ponniyin Selvan: మణిరత్నం కల నెరవేరిందా? 

1 Oct, 2022 09:14 IST|Sakshi

దర్శకుడు మణిరత్నం మూడు దశాబ్దాల కల పొన్నియిన్‌ సెల్వన్‌. దీనిని సాధ్యం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో రెండుసార్లు విఫలమయ్యారు. పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణం అయినప్పటికీ మణిరత్నం నిరుత్సాహ పడలేదు. తన ప్రయత్నాన్ని వదులుకోలే దు. ఈ చిత్రాన్ని దృశ్య కావ్యంగా మలచాలన్నదే జీవిత లక్ష్యంగా భావించారు. అందుకోసం కాస్త ఎ క్కువగానే శ్రమించారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రా న్ని మనసుపెట్టి ఆకుంఠిత దీక్షతో తెరపై ఆవిష్కరించారు. చిత్ర భారీతనానికి మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంపూర్ణంగా సహకరించాయి. చిత్రంలోని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనూ మణిరత్నం ఎంపిక ఫర్‌ఫెక్ట్‌గా వ్య వహరించారు.

ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, వందియదేవన్‌గా కార్తీ, అరుణ్‌ మొళి వర్మన్‌గా జయం రవి, నందిని, ఊమైరాణి పాత్రలకు ఐశ్యర్యరాయ్, కుందవైగా త్రిష, పెరియవేలార్‌గా ప్రభు, పెరియ పళవేట్టయార్‌గా శరత్‌కుమార్, వానతీగా శోభితా ధూళిపాల, పూంగుళిగా ఐశ్వర్య లక్ష్మి పార్తీపన్‌ పల్లవన్‌గా విక్రమ్‌ప్రభు, సుందర్‌ చోళన్‌గా ప్రకాష్‌రాజ్, ఆళ్వార్‌ కదియన్‌గా జయరాం, సెంబియన్‌ మాధవి గా జయచిత్ర ఇలా చిత్రంలోని ప్రతి పాత్రకు సమర్థవంతమైన నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఇక ఆ పాత్రలకు ఆయా నటీనటులు ఎలా న్యాయం చేశారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

మణిరత్నం దర్శక ప్రతిభకు రవివర్మ చాయాగ్రహణం, ఏఆర్‌ రెహా్మన్‌ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక కళా దర్శకుడు తోట తరణి పనితనం గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంతటి ప్రతిభావంతులతో దర్శకుడు మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం కల నెరవేరిందా? అంటే కచ్చితంగా నెరవేరిందనే చెప్పాలి. ఆయన ఈ చిత్రాన్ని ఒక అద్భుత కళాఖండంగా చెక్కారని చెప్పక తప్పదు. ఆయన కెరీర్‌లోనే కాదు, తమిళ సినీ చరిత్రలోనే పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. చోళ సామ్రాజ్యపు చరిత్ర నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ ఆదిత్య కరికాలన్‌ యుద్ధంతో ప్రారంభమవుతుంది. ఆయన శత్రు సేనానిపై విరుచుకుపడి చీల్చి చెండాడడంలో ఆయన మిత్రుడు వందియదేవన్, పార్తీపన్‌ పల్లవన్‌ పాలు పంచుకుంటారు.

అలా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఉంటున్న తరుణంలో నందిని, పళయ పళ వేట్టయార్‌ల వైరి వర్గం దేశాన్ని కైవసం చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న సమాచారం తెలిసిన ఆదిత్య కరికాలన్‌ తన మిత్రుడు వందియదేవన్‌ను అక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకురమ్మని చెబుతాడు. ఆ తరువాత జరిగే పరిణామాలే పొన్నియిన్‌ సెల్వన్‌. ఆదిత్య కరికాలన్, నందితల ప్రేమకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించరు. తత్ఫరిణామమే చోళ దేశపు యుద్ధానికి కుట్రలు, కుతంత్రాలకు కారణం. పొన్నియిన్‌ సెల్వన్‌ నవల చదివిన వారికి ఈ చిత్రంలో లోపాలు తెలుస్తాయేమోగాని, చదవని వాళ్లు ఆనందించే చిత్రం ఇది.    

మరిన్ని వార్తలు