ఆ పాట అప్పుడు ఫాస్టింగ్‌లోనే ఉన్నా!

18 Feb, 2023 01:36 IST|Sakshi

పూజా హెగ్డే

‘‘మన కలలను నెరవేర్చుకునే విషయంలో ఆ పరమశివునిలా ఉగ్రంగా, ఇతరులను క్షమించే విషయంలో ఆయనలా దయతో ఉందాం’’ అంటున్నారు పూజా హెగ్డే. నేడు మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ – ‘‘శివరాత్రికి ఉపవాసం ఉండటం అనేది కొన్నేళ్లుగా పాటిస్తున్నాను. ప్రతి శివరాత్రికి మా నాన్నగారు ఉపవాసం ఉంటారు. నా చిన్నతనం నుంచి ఆయన్ను చూస్తున్నాను కాబట్టి నాన్నని ఫాలో అవ్వా లనుకున్నాను. అలా ఎప్పటినుంచో ఫాస్టింగ్‌ అలవాటైంది. పైగా నేను పదేళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నాను. దాంతో నటరాజుడిని కొలిచేదాన్ని.

ఆ విధంగా శివుడితో నా అనుబంధం ఎప్పటినుంచో ఉంది. స్కూల్‌ డేస్‌ నుంచే శివరాత్రికి ఉపవాసం ఉంటున్నాను. సినిమాల్లోకి వచ్చాక కూడా తప్పనిసరిగా ఆచరిస్తున్నాను. ‘జిగేల్‌ రాణి..’ (‘రంగస్థలం’ సినిమా) పాట షూట్‌ అప్పుడు శివరాత్రి వచ్చింది . ఆ షూట్‌ అప్పుడు ఫాస్టింగ్‌ ఉన్నాను. నాకు వీలు కుదిరినప్పుడల్లా శివుడి ఆలయాలను సందర్శిస్తుంటాను. కాశీ విశ్వనాథ్‌ ఆలయానికి వెళ్లాను. ధర్మస్థలి (కర్నాటక), బాబుల్‌నాథ్‌ మందిర్‌ (ముంబై)లకు కూడా వెళ్లాను. ఇక నాకు శివుని పాటల్లో ‘శివ్‌ తాండవ్‌ స్త్రోత్రం’ ఇష్టం’’ అన్నారు పూజా హెగ్డే. 

వారణాసిలో జరిగే గంగా హారతిని మా నాన్నగారు గతంలో చూశారు. మేం కూడా చూస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అలా రెండేళ్ల క్రితం నేను, అమ్మానాన్న, అన్నయ్య వెళ్లాం. హారతి చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి లభించింది. అది మాటల్లో చెప్పలేను.

గంగా నదీ తీరాన నిలబడి తిలకించడం ఓ గొప్ప అనుభూతి అయితే, పడవలో కూర్చుని తిలకించడం మరో అనిర్వచనీయమైన అనుభూతి.

మరిన్ని వార్తలు