సినీ పరిశ్రమలో మరో విషాదం

11 Nov, 2021 09:05 IST|Sakshi

చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్‌ జయంత్‌ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. సినీ రంగంలో డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి నృత్య దర్శకుడి స్థాయికి ఎదిగారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్‌ జయంత్‌ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం కాదల్‌ దేశం చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యారు.

తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు కూల్‌ జయంత్‌ నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన బుధవారం ఉదయం స్థానిక వెస్ట్‌ మాంబళంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. 

మరిన్ని వార్తలు