పవన్‌.. నీ సైకో ఫ్యాన్స్‌ను అదుపుచెయ్‌

29 Sep, 2021 02:03 IST|Sakshi

లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు.. సినీ నటుడు పోసాని హెచ్చరిక

పవన్‌ కల్యాణ్‌కు నటుడు పోసాని హెచ్చరిక

నా కుటుంబీకులపై ఫ్యాన్స్‌ను పురిగొల్పడం దిగజారుడుతనం

చిరంజీవి కుమార్తెపై కేశినేని వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్, ఆయన ఫ్యాన్స్‌ ఏమయ్యారు?

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన సైకో ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నటుడు, రచయిత పోసాని మురళీకృష్ణ హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే తనను ఎదుర్కోవాలే తప్ప, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడేలా పవన్‌ తన ఫ్యాన్స్‌ను పురి గొల్పడం దిగజారుడుతనమని అన్నారు. ఇలాంటి చర్యలతో తనను మానసికంగా దెబ్బతీయాలనే పవన్‌ కుట్రలు సాగవన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేడని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు 
పవన్‌పై తాను రాజకీయంగా విమర్శలు చేసినప్పట్నుంచీ ఆయన ఫ్యాన్స్‌ నుంచి అదే పనిగా కొన్నివేల బెదిరింపు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని తెలిపారు. తన భార్యను కించపరిచేలా, కుటుంబసభ్యులను తులనాడేలా మెసేజ్‌లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయన కుమార్తెపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి కళ్ల నీళ్లు పెట్టుకుని, మనోధైర్యం కోల్పోయారని చెప్పారు. అప్పుడు తానే స్వయంగా కేశినేని నానితో మాట్లాడి మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా చేశానన్నారు. అప్పుడు ఈ పవన్‌కల్యాణ్, ఆయన ఫ్యాన్స్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. ఆ సమయంలో ‘పోసాని నా గుండెల్లో ఉన్నాడు’ అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌ మీద పవన్‌ ఒక్క వ్యాఖ్య చేస్తేనే ఆయన ఘాటుగా స్పందించారని, అప్పుడు పవన్, ఆయన సైకో ఫ్యాన్స్‌ నోరు ఎత్తలేదని అన్నారు.

నా భార్య మర్యాదస్తురాలు 
తన భార్య మర్యాదస్తురాలని, పవన్‌లా శీలం పోగొట్టుకోలేదని గుర్తించాలని పోసాని వ్యాఖ్యానించారు. తన భార్య, కుటుంబీకుల పట్ల అసభ్యంగా మెసేజ్‌లు పంపినట్టే, నేను కూడా పవన్‌ విషయంలో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. పవన్‌కు సిగ్గూశరం లేదని, అమ్మాయిలను మోసం చేసే బ్రోకర్, లోఫర్‌ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పట్నుంచీ ఆయనో సైకోగా మారిపోయారని మండిపడ్డారు.

పోసానిపై దాడికి యత్నం 
విలేకరుల సమావేశం ముగించుకుని బయట కొచ్చిన పోసానిపై పవన్‌ ఫ్యాన్స్‌గా చెప్పుకునే వ్యక్తులు దాడికి విఫలయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తమై దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి పరిస్థితిని ముందే గమనించిన పోలీసులు ప్రెస్‌క్లబ్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే ప్రధాన ద్వారం వద్ద పవన్‌కు అనుకూలంగా కొంతమంది నినాదాలు చేస్తూ లోనికొచ్చేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ్నుంచి తీసుకెళ్లారు. అయితే పోసాని కారు ఎక్కుతున్న సమయంలో ఓ వ్యక్తి వేగంగా దూసుకొచ్చి దాడికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రికక్తత చోటు చేసుకుంది. అనంతరం పోసానిని పోలీసులు తమ కారులో బయటకు తీసుకెళ్లారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

నాకేమైనా జరిగితే పవనే బాధ్యుడు 
ఈ ఘటన తర్వాత పోసాని మరోసారి మీడియాతో మాట్లాడారు. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే పవన్‌ కల్యాణ్‌ తనను చంపించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. తనకు ప్రాణహాని కలిగితే అందుకు పవన్‌కల్యాణే బాధ్యుడని తెలిపారు. సినిమా షూటింగులకు, ఇతర సాధారణ కార్యక్రమాలకు వెళ్లినా పవన్‌ అభిమానులు తనను టార్గెట్‌ చేస్తున్నారని చెప్పారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.  

మరిన్ని వార్తలు